స్టాలిన్...లాలూ బాటలో ఏపీలో కూడా ?

లేటెస్ట్ గా చూస్తే బీహార్ లో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడిగా తేజస్వి యాదవ్ ని ఏకగ్రీవంగా పార్టీ ఎన్నుకుంది.

Update: 2025-01-21 07:30 GMT

ఇపుడు అంతా ప్రాంతీయ పార్టీల వారసులకు ప్రమోషన్ టైం గా కనిపిస్తొంది. కొద్ది కాలం క్రితం పొరుగున ఉన్న తమిళనాడులో డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిగా చేస్తూ ప్రమోషన్ ఇచ్చేశారు.

లేటెస్ట్ గా చూస్తే బీహార్ లో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడిగా తేజస్వి యాదవ్ ని ఏకగ్రీవంగా పార్టీ ఎన్నుకుంది. దాంతో ఆయన ఆర్జెడీ సర్వ సత్తాక నాయకుడిగా మారిపోయారు. ఇప్పటికే తేజస్వి యాదవ్ బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ ర్యాంక్ హోదాతో ఉన్నారు.

అంతకు ముందు ఆయన నితీష్ కుమార్ తో కలసి ఏర్పాటు అయిన ఘట్ బంధన్ ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. గత ఎన్నికల నుంచి తన నాయకత్వంలో సారధ్యంలో ఆర్జేడీని నడిపిస్తూ వస్తున్న తేజస్వి యాదవ్ ఈసారి పక్కాగా సీఎం కావాలని గట్టి టార్గెట్ ని ఎంచుకున్నారు.

ఈ ఏడాది అక్టోబర్ లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అంతా కలసి పోటీకి దిగుతోంది. బీహార్ వరకూ చూస్తే ఆర్జేడీ పెద్దన్నగా ఉంది. దాంతో ఇండియా కూటమి గెలిస్తే తేజస్వి యాదవ్ సీఎం అవుతారు అని అంటున్నారు. ఆయన తండ్రి లాలూ, తల్లి రబ్రీదేవి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇపుడు తేజస్వి యాదవ్ సీఎం అయితే ఒకే కుటుంబంలో ముగ్గురు ఇలా సీఎంలు అయిన రికార్డు లాలూ ఫ్యామిలీ సొంతం అవుతుంది.

ఇవన్నీ పక్కన పెడితే కర్ణాటకలో కూడా దేవేగౌడ వారసుడిగా ఆయన కుమారుడు కుమారస్వామి రాజకీయ అరంగేట్రం చేసి నిలదొక్కుకున్నారు. ఇపుడు ఆయన తన కుమారుడు నిఖిల్ గౌడాను ఫ్యూచర్ లీడర్ గా తీర్చిదిద్దుతున్నారు. ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్ళి మరీ అమిత్ షా ఆశీస్సులు నిఖిల్ గౌడా తీసుకున్నారు.

ఇక్ కట్ చేస్తే ఏపీ పాలిటిక్స్ లో కూడా నారా లోకేష్ హవా సాగుతోంది. ఆయనకు టీడీపీలో తిరుగులేదు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తొందరలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా దక్కుతుందని అంటున్నారు. ఇక ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలన్న డిమాండ్ అయితే చాలా జోరుగా ముందుకు వస్తోంది. ఇపుడు అంతా వారసుల సీజన్ కాబట్టి ఇదే ఊపుతో నారా లోకేష్ కి కూడా ప్రమోషన్ దక్కుతుందా అంటె ఏమి జరిగినా జరగవచ్చు అన్నది రాజకీయ పండితుల మాటగా ఉంది.

Tags:    

Similar News