రెడ్ బుక్ పేర్లు త్వరలో అరెస్టులు!
గత ప్రభుత్వంలో ఇసుక, మద్యం కుంభకోణాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టమని ప్రకటించారు. ఈ వ్యవహారాల్లో పదుల సంఖ్యలో అరెస్టులు ఉంటాయని సంకేతాలిచ్చారు.
మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లు రెడ్ బుక్ పని చేస్తూనే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. నారావారిపల్లె సంక్రాంతి వేడుకల్లో తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులతో మాట్లాడిన మంత్రి లోకేశ్ రెడ్ బుక్కును అమలు చేయడం లేదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇసుక, మద్యం స్కాంల్లో త్వరలో అరెస్టులు జరుగుతాయని వెల్లడించారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్కును రాయడం మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులు పెట్టిన పోలీసులు, వైసీపీ నేతల పేర్లను ఎర్ర పుస్తకంలో రాసుకుంటామని, అధికారంలోకి రాగానే వారిపై చర్యలు ఉంటాయని ప్రకటించారు. అన్నట్లుగానే అధికారంలోకి రాగానే రెడ్ బుక్కులో పేర్లు ఉన్నవారిని లూప్ లైన్కు పంపారు. కొందరు పోలీసు అధికారులను వీఆర్ లో ఉంచారు.
అయితే అనుకున్నంత వేగంగా కార్యకర్తలను వేధించిన వారిపై చర్యలు ఉండటం లేదని టీడీపీ కార్యకర్తల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే మంత్రి లోకేశ్ రెడ్ బుక్ పై ప్రకటన చేశారు. గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారు తప్పించుకోలేరని త్వరలో వారంతా జైలుకు వెళతారని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో ఇసుక, మద్యం కుంభకోణాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టమని ప్రకటించారు. ఈ వ్యవహారాల్లో పదుల సంఖ్యలో అరెస్టులు ఉంటాయని సంకేతాలిచ్చారు. ఇక పార్టీపరంగా సంస్థాగత మార్పులపైనా మంత్రి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులిస్తామన్నారు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. తనను కలిసిన వారికి పదవులు వస్తాయని పొరపడవద్దని, పార్టీ కోసం పనిచేసిన వారి పేర్లు అన్నీ తన వద్ద ఉన్నాయని మంత్రి తెలిపారు.
పార్టీలో కీలక విభాగమైన పొలిట్ బ్యూరోలో కొత్త వారికి అవకాశాలిచ్చే అంశంపైనా మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి 30 శాతం కొత్త నేతలను పొలిట్ బ్యూరోలోకి తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఈ ఏడు నెలల కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కూటమిలో టీడీపీది పెద్దన్న పాత్ర అని చెప్పిన మంత్రి మిత్రధర్మంతో వ్యవహరించాలని కోరారు.