లోకేష్ రెడ్ బుక్...కూటమిలో బీటలు వస్తున్నాయా ?
రెడ్ బుక్. ఏమిటీ రెడ్ బుక్ అసలు ఇలాంటి బుక్ అన్నది ఒకటి ఉంటుందా ఈ తరహా చర్చ గతంలో నడచింది.
రెడ్ బుక్. ఏమిటీ రెడ్ బుక్ అసలు ఇలాంటి బుక్ అన్నది ఒకటి ఉంటుందా ఈ తరహా చర్చ గతంలో నడచింది. దానికి చాన్స్ ఇచ్చిన వారు నారా లోకేష్. ఆయన మెదడు లో నుంచి పుట్టిన ఒక వినూత్న పొలిటికల్ థాట్ గా రెడ్ బుక్ ని అందరూ చూశారు. లోకేష్ యువగళం సభలలో రెడ్ బుక్ ఒకటి రాస్తున్నాను అని చెప్పినపుడు మొదట్లో లైట్ తీసుకున్న వారు సైతం ఇపుడు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని మీద పూర్తి స్థాయిలో చర్చిస్తున్నారు.
అందుకు కారణం రెడ్ బుక్ లో రాసుకున్న పేర్లను బట్టి వరసగా వైసీపీ నేతల మీద కేసులను నమోదు చేస్తున్నారని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. రెడ్ బుక్ లో ఉన్న పేర్లలో ఒకటిగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేయడం అన్నది కూడా ఉంది. వంశీ అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది.
వైసీపీ కూడా ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకోవడం జగన్ వంశీని ములాఖత్ ద్వారా పలకరించడం వంటివి జరిగిన తరువాత ఈ చర్చ మరింతగా పెరిగింది. ఇక రెడ్ బుక్ లోని పేర్లు వంశీతోనే ఆగవని, ఇంకా మాజీ మంత్రులు అనేక మంది ఉంటారని వారందరి విషయంలో అరెస్టులు కేసులు ఉంటాయని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపధ్యంలో రెడ్ బుక్ అనేది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది.
ఈ క్రమంలో రెడ్ బుక్ ని తుచ తప్పకుండా అమలు చేస్తున్నది మంత్రి నారా లోకేష్ అని కూడా ప్రచారం సాగుతోంది. వంశీ అరెస్టు తరువాత లోకేష్ మీడియాతో మాట్లాడుతూ రెడ్ బుక్ అన్నది ప్రజల ఆమోదం పొందిందని చెప్పడమూ చర్చకు తావిచ్చింది. తాను తొంబైకి పైగా సభలలో రెడ్ బుక్ గురించి జనాలకు చెప్పానని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక రెడ్ బుక్ లో రాసుకున్న మేరకు అవినీతి అక్రమాలు చేసిన వారి మీద చట్ట ప్రకారం కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని చెప్పామని ఆయన అంటున్నారు.
వంశీ అరెస్టు తరువాత రెడ్ బుక్ విషయంలో సమర్ధించుకుంటూ లోకేష్ చేసిన కామెంట్స్ ఇవి. ఇదిలా ఉంటే ఏపీలో కూటమి పాలనకు ఎనిమిది నెలలు పూర్తి అయ్యాయి. పాలన ఇపుడే గాడిన పడుతోంది. సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో రెడ్ బుక్ పేరుతో రివెంజ్ పాలిటిక్స్ కి తెర తీసి వైసీపీని తట్టి లేపడం అవసరమా అన్న చర్చ కూడా కూటమిలో సాగుతోంది. కూటమి ప్రభుత్వంలో టీడీపీతో పాటుగా జనసేన బీజేపీ కూడా భాగస్వాములుగా ఉన్నాయి.
ఈ మూడు పార్టీలూ ప్రభుత్వానికి సంబంధించిన అంశం దేనికైనా జవాబు దారీగా ఉంటాయి. అయితే రెడ్ బుక్ అన్నది వేరు. అది టీడీపీ క్యాడర్ ని ఇబ్బంది పెట్టిన వారి కోసం లేదా ఆ పార్టీ అయిదేళ్ళుగా ఇబ్బంది పడిన సందర్భాలను గుర్తుంచుకుని బాధ్యులు మీద యాక్షన్ తీసుకునే ఒక ప్రక్రియగా ఉంది అని అంటున్నారు. రెడ్ బుక్ పేరుతో ఏపీలో రివెంజ్ పాలిటిక్స్ కి చోటిస్తే కూటమి ప్రభుత్వం అభాసుపాలు అవుతుందన్న చర్చ కూడా ఉంది.
దాంతో తమకు సంబంధం లేకున్నా తాము కూడా రాజకీయంగా ఇబ్బందుల్లో పడతామన్నది బీజేపీ వాదనగా ఉంది అని అంటున్నారు. రాష్ట్రంలోని సమస్యలు పరిష్కారాలు, అభివృద్ధి వీటి మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టి పనిచేయాలన్నది కూటమిలోని బీజేపీ లాంటి పార్టీల వాదనగా ఉందని అంటున్నారు. నిజానికి రెడ్ బుక్ పేరుతో అరెస్టులు చేయడం వల్ల వైసీపీకి లేని పోని సానుభూతి తెచ్చిపెట్టడం అవుతుందని జనాలకు కూడా నచ్చే అంశం కాదని అంటున్నారు.
ప్రభుత్వం మంచి పంచులు చేసి దానిని జనంలో ఉంచి చెప్పుకోనీయకుండా ఈ రివెంజ్ పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారితే అపుడు మొత్తానికే ఇబ్బంది అవుతుందని బీజేపీలో చర్చగా ఉందని ఇన్నర్స్ సర్కిల్స్ టాక్ గా ఉంది అని అంటున్నారు. పైగా కూటమిలో ఉన్న పార్టీలకు ఇది ఏ మాత్రం సంబంధం లేని విషయంగానూ చూస్తున్నారు అని చెబుతున్నారు.
ఎక్కడో ఒక చోట రివెంజ్ పాలిటిక్స్ కి ఫుల్ స్టాప్ పెట్టకుండా వారు చేశారని వీరు మళ్ళీ వీరు చేశారని వారు ఇలా ఇచ్చుకుంటూ పోతే ఏమి లాభం అన్నది కూడా ఒక చర్చగా ఉందిట. బీజేపీ అయితే ఈ రెడ్ బుక్ మీద అంతగా ఆసక్తిని చూపించకపోగా వ్యతిరేకిస్తోందని అంటున్నారు.
ఇప్పటికైనా రెడ్ బుక్ పేరుతో కేసులు అరెస్టుల విషయంలో ఎక్కడో ఒకచోట ఆగకపోతే ఏపీ కోసం కష్టపడుతున్న కూటమి ప్రభుత్వానికి ఉన్న పేరు శ్రమ అన్నీ కూడా ఇందులో పడి కొట్టుకుపోతాయని అంటున్నారు. అయితే రెడ్ బుక్ అన్నది టీడీపీకి మరీ ముఖ్యంగా లోకేష్ కి చాలా కీలకంగా ఉంది. ఆ మధ్యన దావోస్ ట్రిప్ కి లోకేష్ వెళ్ళినపుడు కూడా అక్కడ పార్టీ సానుభూతిపరులకు ఆయన రెడ్ బుక్ లో ఉన్న వారి మీద యాక్షన్ తప్పనిసరిగా ఉంటుందని మాట ఇస్తున్నామని స్పష్టం చేశారు.
మరి అంతలా రెడ్ బుక్ మీద టీడీపీ యువ నాయకత్వం ఫోకస్ పెడుతూంటే బీజేపీ వ్యతిరేకిస్తోంది అన్న వార్త్గలు మాత్రం కొత్త చర్చకు తావిస్తున్నాయి. కూటమికి పెద్దన్నగా టీడీపీ ఉంది. ఆ పార్టీ మాటే చెల్లుతుంది. మరి రెడ్ బుక్ వద్దు అంటే బీజేపీ ఏమి చేస్తుంది, ఇది కాస్తా కూటమిలో బీటలు వారేందుకు ఏమైనా దారి తీస్తుందా అన్న చర్చ సాగుతోంది.