జగన్ అప్పులు.. లోకేశ్ తాజా లెక్కలు
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పులు ఎంత అన్న చర్చే ఎక్కువగా జరుగుతోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పులు ఎంత అన్న చర్చే ఎక్కువగా జరుగుతోంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా, రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ప్రచారం చేసింది. ఇక అధికారంలోకి వచ్చాక ఆ లెక్కను కాస్త సవరించి చూపించింది. అయితే ఎన్నికల ప్రచారంలో చెప్పిన మొత్తం కన్నా, ప్రభుత్వం శ్వేతపత్రాల ద్వారా వెల్లడించిన అప్పుల మొత్తం తక్కువగా ఉండటంతో వైసీపీ ప్రతిదాడికి దిగింది. అయితే లెక్కల్లో చూపని అప్పులతో కలిపితే రూ.14 లక్షల కోట్లు పైనే అప్పులు ఉంటాయని ప్రభుత్వం ఎదురుదాడి చేసింది. ఇలా తొమ్మిది నెలలుగా ఏపీ అప్పులపై కూటమి, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా, తాజాగా టీడీపీ యువనేత, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ వెల్లడించిన లెక్కలు మరింత ఆసక్తికరంగా మారాయి.
రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించిన వైసీపీ అన్నిరకాలుగా భ్రష్టుపట్టించిందని ఆరోపించిన మంత్రి లోకేశ్.. వైసీపీ అప్పులపై తనదైన స్టైల్ లో లెక్కలు బయటపెట్టారు. ఏపీని పాలించిన ముఖ్యమంత్రులు అందరూ కలిపి 58 ఏళ్లలో చేసిన అప్పులకు రూ.14,155 కోట్లు వడ్డీగా చెల్లించేవారమని చెప్పిన లోకేశ్.. గత ప్రభుత్వంలో చేసిన అప్పుల వల్ల వడ్డీ మొత్తం రూ.24,944 కోట్లకు చేరిందని వెల్లడించారు. 2019 వరకు ఉన్న ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీకంటే జగన్ చేసిన అప్పుపై చెల్లించే వడ్డీనే దాదాపు రూ.11 వేల కోట్లు ఉందని లోకేశ్ చెప్పడం వైరల్ అవుతోంది.
వైసీపీ అప్పులు రాష్ట్రాన్ని ఎంతలా కుదేలు చేశాయో చూపడానికి లోకేశ్ ఈ సారి వెరైటీ రూట్లో వచ్చారంటున్నారు. ఐదేళ్ల పాలనలో కేవలం అప్పులు చేస్తూ కాలం వెల్లదీసిన వైసీపీ నేతలు.. రాష్ట్ర ప్రజలపై తీవ్ర భారాన్ని మోపారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. తెచ్చిన అప్పులలో మూలధన వ్యయం తక్కువగా ఉండటం వల్ల సంపదను సృష్టించలేకపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే విమర్శిస్తున్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పణంగా పెట్టి అప్పులు చేయడమే కాకుండా, తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని వైసీసీ విమర్శించడాన్ని ముఖ్యమంత్రి తప్పుబడుతున్నారు. తాను సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోవడానికి వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసమే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం గల్లపెట్టి ఖాళీ అంటూ సీఎం తన నిస్సహాయతను వ్యక్తం చేయగా, తాజాగా మంత్రి లోకేశ్ 58 ఏళ్ల పాటు పాలించిన ప్రభుత్వాలు చేసిన అప్పులు, ఐదేళ్లలో వైసీపీ చేసిన అప్పులకు మధ్య తేడాను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. రూ.14 లక్షల కోట్లు అప్పుచేశారని పాత లెక్కలు చెప్పి ప్రజలను బోర్ కొట్టించడం కన్నా, వెరైటీగా ఈ సారి వడ్డీ లెక్కలు బయటపెట్టి వైసీపీని మరింత ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.