అధికారిక సమావేశంలో మంత్రి లోకేశ్ టీ షర్టుతో హాజరుకావొచ్చా?!
దావోస్ ఆర్థిక సదస్సుకు ఏపీ తరఫున వెళ్లి మంత్రి లోకేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
దావోస్ ఆర్థిక సదస్సుకు ఏపీ తరఫున వెళ్లి మంత్రి లోకేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో వెళ్లిన లోకేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే ఈ సదస్సులో లోకేశ్ డ్రెస్ కోడ్ పై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది.
దావోస్ తొలి రోజు సమావేశాల్లో లోకేశ్ టీ షర్టు ధరించి పారిశ్రామిక వేత్తలతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఒక అంతర్జాతీయ వేదికపై ప్రభుత్వ అధికార ప్రతినిధిగా అధికారిక హోదాలో వెళ్లిన లోకేశ్ ఇలా టీ షర్టు ధరించవచ్చా? అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అధికారిక సమావేశాలకంటూ ప్రత్యేక డ్రెస్ కోడ్ ఏమీ ఉండకపోయినా.. హుందాగా కనిపించేందుకు ఆయా దేశాలు, సంస్థల తరఫున ప్రతినిధులుగా వెళ్లేవారు సూటు, బ్లీజర్ వంటి దుస్తులు ధరిస్తుంటారు. ఇంకొందరైతే తమ దేశాలకు చెందిన సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎప్పుడూ ధరించే ఖద్దరు ఫ్యాంటు, షర్టు ధరించారు. కానీ, లోకేశ్ కాస్త భిన్నంగా టీ షర్టు వేసుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఏపీలో ఉన్నప్పుడు తెల్లచొక్కాతో సంప్రదాయంగా కనిపించే లోకేశ్ అంతర్జాతీయ సదస్సుకు టీ షర్టుతో వెళ్లడం వెనుక ఏదైనా కారణం ఉందా? అంటూ అంతా ఆరా తీస్తున్నారు. అయితే విపక్ష నేతలు మాత్రం లోకేశ్ డ్రెస్సింగ్ పై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు టీ షర్టులో లోకేశ్ అదిరిపోయారని, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని ఆయన మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు పోస్టులు చేస్తున్నారు.