లక్ష్మణుడు లాంటి తమ్ముడు రామ్మూర్తి నాయుడు

ఏపీ సీఎం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మరణం పట్ల టీడీపీ శ్రేణులు విచారం వ్యక్తం చేస్తున్నాయి.

Update: 2024-11-16 10:40 GMT

ఏపీ సీఎం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మరణం పట్ల టీడీపీ శ్రేణులు విచారం వ్యక్తం చేస్తున్నాయి. నారా రామ్మూర్తినాయుడు గురించి చాలా మందికి తెలియని విషయాలు ఆయన మరణానంతరం ఇపుడు చర్చకు వస్తున్నాయి. ఆయన పేరులో రాముడు ఉన్నాడు కానీ ఆయన అచ్చమైన లక్ష్మణుడు అని అంతా అంటున్నారు.

అన్న చంద్రబాబు అంటే ఎంతో ప్రేమ అభిమానం గౌరవం రామ్మూర్తి నాయుడుకి మెండుగా ఉండేవని చెబుతారు. రామ్మూర్తినాయుడు చంద్రబాబు తొలిసారి 1978లో చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసినపుడు ఆయన గెలుపు కోసం ఎంతో కృషి చేశారని చంద్రగిరిలో చెబుతారు.

అంతే కాదు చంద్రబాబు రాజకీయాల్లో ఉంటే చిన్న చిన్న కాంట్రాక్టు పనులు ఆ రోజులలో చేసి అలా వచ్చిన ఆదాయాన్ని అన్న రాజకీయాల కోసం ఖర్చు చేసేవారు అని కూడా చెబుతారు. చంద్రబాబు రాజకీయంగా ఎదగాలని అన్నదే తమ్ముడి అభిమతంగా ఉండేది.

ఇదిలా ఉంటే చంద్రబాబు వెంటే కాంగ్రెస్ లో ఉన్న రామ్మూర్తి నాయుడు ఆయన టీడీపీలో చేరితే తాను కూడా అదే పార్టీలో ఉండేవారు. చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీని చూసేవారు. ఆయనకు రాజకీయాల్లో పోటీ చేయాలని కోరిక మాత్రం 1994లో వచ్చిందని చెబుతారు. ఆయనకు టికెట్ ని అన్న ఎన్టీఆర్ ఇచ్చారు. అలా ఆయన 16 వేల పై చిలుకు మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి వచ్చారు

ఇక 1999లో అదే నియోజకవర్గం నుంచి టికెట్ ని చంద్రబాబు పార్టీ అధినేతగా ఇస్తే కేవలం రెండు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. 2004లో ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా 32 వేలకు తక్కువ కాకుండా ఓట్లు సాధ్యించారు అంటే చంద్రగిరిలో ఆయనకు ఉన్న పట్టు తెలుస్తుంది అని అంటారు. ఆ తరువాత కొంతకాలం రాజకీయ కారణాల వల్ల కాంగ్రెస్ లో చేరిన రామ్మూర్తి నాయుడు ఆ మీదట పూర్తిగా రాజకీయాలకు స్వస్తి చెప్పారు.

ఆయన దాదాపుగా ప్రజా జీవితం నుంచి కూడా తప్పుకుని తన సొంత జీవితాన్నే కొనసాగించారు. ఇక రామ్మూర్తినాయుడుకు వ్యవసాయం అంటే ఇష్టం. ఆయన రైతుగానే ఉండడానికి ఇష్టపడేవారు. ఇక ఆయన చిన్నతనంలో నటన మీద ఆసక్తితో అనేక నాటకాలు కూడా ప్రదర్శించారు. ఇక తనలోని నటుడిని కుమారుడిలో చూసుకోవడం కోసం నారా రోహిత్ ని ప్రోత్సహించారు. రోహిత్ కూడా విలక్షణ నటుడిగా తెలుగు చలన చిత్ర సీమలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.

మొత్తం మీద చూస్తే బయట జరిగే ప్రచారానికి పూర్తి భిన్నంగా అన్న చంద్రబాబు అంటే ఎంతో ప్రేమగానే రామ్మూర్తి నాయుడు చివరి వరకూ ఉండేవారు అని అంటారు. ఆయన మరణం పట్ల చంద్రగిరి నియోజకవర్గం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News