ఎన్టీఆర్ కే పుట్టి ఉంటే.. మరీ ఇవేం మాటలు లక్ష్మీపార్వతి?
లక్ష్మీపార్వతి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును స్కిల్ స్కాం ఆరోపణల నేపథ్యంలో జైలుపాలైన నేపథ్యంలో.. ఆయన సతీమణి నారా భువనేశ్వరి బస్సుయాత్ర చేస్తామన్న ప్రకటన చేయటం తెలిసిందే
లక్ష్మీపార్వతి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును స్కిల్ స్కాం ఆరోపణల నేపథ్యంలో జైలుపాలైన నేపథ్యంలో.. ఆయన సతీమణి నారా భువనేశ్వరి బస్సుయాత్ర చేస్తామన్న ప్రకటన చేయటం తెలిసిందే. దీనిపై మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చిన లక్ష్మీ పార్వతి నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేసిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. భువనేశ్వరిపై లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు ఆమె వయసుకు తగ్గట్లుగా లేవంటున్నారు.
ఎన్టీఆర్ కు ద్రోహం చేసి ఉంటే.. ఆ రోజున తెలుగుజాతి.. తెలుగు ప్రజలు ఎందుకు మౌనంగా ఉండేవారు? నిజానికి ఎన్టీఆర్ కు అలాంటి పరిస్థితి తీసుకురావటంలోనూ.. ప్రజల్లోనూ ఆయనపట్ల ఎలాంటి సానుభూతి లేకుండా పోవటానికి తాను.. తాను చేసిన పనులు.. తీసుకున్న నిర్ణయాలే కారణమన్న విషయాన్ని లక్ష్మీ పార్వతి ఎందుకు మర్చిపోతున్నారు. ఎన్టీఆర్ పేరుతో ఆమె ఏర్పాటు చేసిన పార్టీ ఒక్క సీటు అంటే ఒక్క సీటు ఎందుకు గెలవలేదు? అంతెందుకు.. ఆమె ఎందుకు విజయం సాధించలేదు?
ఆమె వెంట వచ్చిన కొందరు నేతలు.. ఆ తర్వాత ఎందుకు సర్దుకున్నారు? చివరకు ఆమే మరో పార్టీలో చేరాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాల్టి రోజున.. నారా భువనేశ్వరిని ఉద్దేశించి.. ఎన్టీఆర్ కే పుట్టి ఉంటే.. ఇలా చేయ్ లాంటి మాటలు అవసరమా? అన్నది ప్రశ్నగా మారింది. చంద్రబాబు.. ఆయన కుటుంబసభ్యుల మీద లక్ష్మీ పార్వతికి కోపం ఉంటే.. ఆ కోపాన్ని చౌకబారు వ్యాఖ్యలతో విరుచుకుపడే కన్నా.. అర్థవంతమైన విమర్శలు.. ఆరోపణలు చేస్తే బాగుంటుంది. అందుకు భిన్నంగా నోటికి వచ్చినట్లుగామాట్లాటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
చంద్రబాబును ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఆయన సతీమణి భువనేశ్వరిని నోటికి వచ్చినట్లుగా లక్ష్మీపార్వతి నోరు పారేసుకోవటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు ఆమెపై మర్యాద.. గౌరవాన్ని మరింత తగ్గేలా చేశాయని అంటున్నారు. ఏ రోజున కూడా లక్ష్మీ పార్వతిని ఉద్దేశించి కానీ.. ఆమె తీరును చంద్రబాబుకానీ.. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కానీ తప్పుగా మాట్లాడింది లేదు.
అదే గౌరవాన్ని లక్ష్మీ పార్వతి కూడా ప్రదర్శించాలి కదా? అందుకు భిన్నంగా తన భర్త మొదటి భార్య కుమార్తెలను ఉద్దేశించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం దేనికి నిదర్శనం? ఒక విధంగా చూస్తే.. ఎన్టీఆర్ మొదటి సంతానం పిల్లలు లక్ష్మీపార్వతికి కూడా పిల్లలే అవుతారు కదా? వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా.. అది కూడా దరిద్రపు గొట్టు రాజకీయాల కోసం నోటికి వచ్చినట్లుగా మాట్లాడం చూస్తే.. లక్ష్మీపార్వతి మీద కాస్తో.. కూస్తో గౌరవం ఉన్నోళ్లు కూడా వదిలేసుకోవటం ఖాయం.
లక్ష్మీ పార్వతి నోటి నుంచి వచ్చిన దారుణ వ్యాఖ్యల్లో కొన్నింటిని చూస్తే..
- ఈ రోజు నా తండ్రి(ఎన్టీఆర్) జ్ఞాపకాలతో హృదయం నిండిపోయింది. తెలుగు జాతి కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహానటుడు, నాయకుడు ఎన్టీఆర్. నిజం ఎంత కఠినంగా ఉన్నా ఎల్లప్పుడూ దానికి కట్టుబడి ఉండాలని ఆయన మనకు బోధించాడు. న్యాయానికే మద్దతుగా వుంటూ తెలుగు ప్రజలకు సేవ చేయాలనే అంకితభావంతో పనిచేసే ఆయన మనందరికీ ఆదర్శం'' అంటూ తండ్రి ఎన్టీఆర్ ను గుర్తుచేసుకుంటూ భువనేశ్వరి ట్వీట్ చూశాక నాకు మాట్లాడలనిపించింది. అందుకే మీడియా ముందుకు వచ్చా.
- ఇన్నాళ్ల తర్వాత మీకు మీ తండ్రి గుర్తొచ్చారా? తండ్రికి అన్యాయం జరిగితే ఇన్నేళ్లలో ఒక్కసారయినా ఖండించింది లేదు. భువనేశ్వరే లక్షల కోట్లు సంపాదించి తేవాలంటూ చంద్రబాబు, లోకేష్ లతో అవినీతి చేపిస్తోంది. నిజంగానే తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటే నీ భర్త చంద్రబాబు అక్రమ సంపాదన గురించి బయటపెట్టాలి.
- నిజాయితీ పరుడుకి సేవచేసిన నేను అదృష్టవంతురాలిని. భువనేశ్వరి అవినీతి పరులను కాపాడటానికి బస్సు యాత్ర చేస్తానంటోంది. ఇప్పుడు నీ భర్తపై చూపిస్తున్న జాలి, సానుభూతి నాన్నపై చూపించి ఉంటే సంతోషించేవారు. నీ తండ్రి పార్టీ లాక్కుని ప్రాణం తీస్తే ఏం చేసావు. నీకు నిజంగానే మానవతా విలువలు ఉంటే... నువ్వు ఎన్టీఆర్ కే పుట్టి ఉంటే నిజాలు చెప్పాలి.
- నా భర్త చంద్రబాబు తప్పు చేయలేదని భువనేశ్వరి ఎందుకు చెప్పటం లేదు. అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన భర్త కోసం ప్రజల్లోకి వెళతావా? వెళ్లి వారికి ఏం చెబుతావు? సింగపూర్.. మారిషస్.. దుబాయ్ లలో నీ కుటుంబం లక్షల కోట్లు దాచలేదా? ఇన్నాళ్లకు పెద్ద దొంగ దొరికాడు. అతడిని జైల్లో పెట్టించి శిక్షించటం తప్పా?
- గొప్ప తల్లివి నువ్వు. పనికిమాలిన కొడుక్కి జన్మనిచ్చావు. మళ్లీ నా భర్తకు అధికారం ఇవ్వండి. లక్ష కోట్లు దోపిడీ చేస్తారని చెప్తావా?