చంద్రబాబు సతీమణి సమయ స్ఫూర్తి.. నిలబడిన ప్రాణం!
ఈ విషయం తెలిసిన నారా భువనేశ్వరి ప్రయాణికుడు శశిధర్ అస్వస్థతకు గురైన అంశాన్ని ఫోన్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు.
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రదర్శించిన సమయం స్ఫూర్తి.. ఓ ప్రయాణికుడి ప్రాణాన్ని కాపాడింది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే భువనేశ్వరి.. తన కుటుంబం గురించే కాకుండా.. ప్రజల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అనేక సామాజిక సేవలు కూడా అందిస్తున్నారు. దీంతో ఆమె మనసు, ఆలోచనలు అన్నీ.. ప్రజల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ ఆలోచనే.. నిండు ప్రాణాన్ని కాపాడేందుకు దోహద పడింది. ఆమె ప్రదర్శించిన సమయ స్ఫూర్తితో ఓ ప్రయాణికుడు ప్రాణాలు నిలబెట్టుకున్నాడు.
ఏం జరిగింది?
బుధవారం కుప్పంలో పర్యటించేందుకు నారా భువనేశ్వరి హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలు దేశారు. ఈ సమయంలో తిరుపతికి వస్తూ.. ఆమె హైదరాబాద్‌లో ఎక్కిన విమానాంలో ఓ ప్రయాణికుడు శశిధర్ మరికొద్ది సేపట్లలో తిరుపతికి చేరుకుంటామనగా.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయం తెలిసిన విమాన సిబ్బంది.. ప్రాథమిక వైద్యం అందించినా.. ఊపిరి ఆడకపోవడంతో సదరు ప్రయాణికుడు వేదన భవిస్తూనే ఉన్నాడు. ఏమాత్రం స్వస్థత చేకూరలేదు.
ఈ విషయం తెలిసిన నారా భువనేశ్వరి ప్రయాణికుడు శశిధర్ అస్వస్థతకు గురైన అంశాన్ని ఫోన్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై హుటాహుటిన.. తిరుపతి కలెక్టర్ ఆఫీసుకు సమాచారం అందింది. కలెక్టర్ చొరవ తీసుకుని.. విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. దాంతో తిరుపతి ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయ్యే సమయానికి రన్ వే పైకి.. డాక్టర్లు, అంబులెన్సు చేరుకున్నాయి. డాక్టర్లు సకాలంలో శశిధర్‌కు చికిత్స అందించారు. ఆక్సిజన్ అందించారు. దీంతో శశిధర్ ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు.
తన పట్ల ఉదారంగా వ్యవహరించిన భువనేశ్వరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే.. శశిధర్ కోలుకునే వరకు భువనేశ్వరి అక్కడే ఉండి పరిశీలించారు. అనంతరం.. ఆమె చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం లో పర్యటనకు బయలు దేరి వెళ్లారు. కుప్పంలో చంద్రబాబు నూతనంగా ఇల్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనిని భువనేశ్వరి అనునిత్యం పర్యవేక్షిస్తున్నారు. పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూస్తున్నారు. వచ్చే శ్రావణ మాసంలో గృహప్రవేశం చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.