ఢిల్లీలో యుద్ధంచేస్తే ఉపయోగముంటుందా ?
స్కిల్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టు నేపధ్యంలో నారా లోకేష్ దేశ రాజధాని ఢిల్లీలో యుద్ధం చేస్తున్నారు.
స్కిల్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టు నేపధ్యంలో నారా లోకేష్ దేశ రాజధాని ఢిల్లీలో యుద్ధం చేస్తున్నారు. జాతీయ మీడియాకు వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. చంద్రబాబుకు స్కామ్ తో ఎలాంటి సంబంధంలేదని, అన్యాయంగా కేసులుపెట్టి అరెస్టుచేశారని లోకేష్ పదేపదే చెబుతున్నారు. నిజానికి లోకేష్ మీడియా ఇంటర్వ్యూల వల్ల ఏమాత్రం ఉపయోగం ఉంటుందో తెలీటంలేదు. జాతీయ ఛానళ్ళకు ఇంటర్వ్యూలు ఇవ్వటం వల్ల లోకేష్ ఏమి ఆశిస్తున్నారన్నది అర్ధంకావటంలేదు.
ఇప్పటికే చంద్రబాబు అరెస్టయి రిమాండుకు వెళిపోయారు. చంద్రబాబుకు బెయిల్ రావాలంటే కోర్టుల్లోనే పోరాటాలు చేయాలంతే. ఏసీబీ కోర్టులో రెండు పిటీషన్లు వేస్తే రెండింటిని కొట్టేసింది. అందుకనే బెయిల్ పిటీషన్లను లాయర్లు హైకోర్టులో మూవ్ చేశారు. దాదాపు నాలుగు బియల్ పిటీషన్లు, మూడు ముందస్తు బెయిల్ పిటీషన్లను లాయర్లు వేశారు. ఏకకాలంలో ఇటు ఏసీబీ కోర్టులోను అటు హైకోర్టులోను పిటీషన్లు దాఖలుచేశారు.
ఇవన్నీ వివిధ తేదీల్లో విచారణకు రాబోతున్నాయి. వీటిల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకునేంతవరకు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉండకతప్పదు. చంద్రబాబు జైలులో నుండి బయటకు రావాలంటే న్యాయపోరాటం ఒకటే మార్గమని అందరికీ తెలుసు. అలాగే నిర్దోషిగా బయటపడాలంటే కూడా కోర్టులో పోరాటమే ఏకైక మార్గం. అయితే ఇందుకు చాలాకాలం పడుతుంది. ఎంతకాలం పట్టినా ఇంతకుమించిన మార్గం మరోటిలేదు. అందుకని పోరాటానికి అవసరమైన అస్త్రాలను లోకేష్ సిద్ధం చేసుకోవాలి. మంచి లాయర్లను నియమించుకోవటం, నిర్దోషిగా నిరూపించుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవటం ఒకటే మార్గం.
ఇదే సమయంలో చంద్రబాబుకు నైతికంగా మద్దతు ఇవ్వటం కూడా లోకేష్ చేయాల్సిన పనే. వీటన్నింటినీ వదిలేసి ఢిల్లీలోని ఛానళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తుంటే ఏమిటి ఉపయోగం ? చంద్రబాబు దోషి లేదా నిర్దోషని తేల్చేది ఛానళ్ళు కాదు. కాబట్టి అనవసరంగా ఢిలీలోని ఛానళ్ళ చుట్టు తిరుగుతు టైం వేస్టు చేసేబదులు మంచి లాయర్లతో మాట్లాడుకుని చంద్రబాబును బయటకు తీసుకొచ్చే మార్గాలపై చర్చలు జరిపితే బాగుంటుంది. లేకపోతే విలువైన సమయాన్ని లోకేష్ వేస్టుచేస్తున్నట్లే అనుకోవాలి.