లోకేష్ కేరాఫ్ మంగళగిరి...గ్రౌండ్ రిపోర్ట్ ఇదే...!
మంగళగిరిలో తన విజయం ఈసారి ఖాయమని చెప్పడమే కాదు, భారీ మెజారిటీతో గెలవాలని చూస్తున్నారు. మంగళగిరి మీద లోకేష్ అంతలా ఫోకస్ పెట్టడానికి కారణం ఉంది.
నారా లోకేష్ ఈ సారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారు అని అంతా అనుకున్నారు. ఆయన టీడీపీలో ప్రముఖ స్టార్ క్యాంపెయినర్ గా ఉంటారని అంతా ఊహించారు. నిజానికి లోకేష్ యుగళం పాదయాత్ర గత ఏడాది అంతా చేశారు ఆ తరువాత ఈ మధ్య దాకా శంఖారావం పేరిట సభలు నిర్వహించారు.
కానీ ఇపుడు మాత్రం లోకేష్ పూర్తిగా మంగళగిరికే పరిమితం అయిపోయారు. ఆయన తాను పోటీ చేసే నియోజకవర్గం చూసుకుంటున్నారు. ఆయన ప్రతీ మండలం కలియ తిరుగుతున్నారు. ప్రజలకు చేరువ అవుతున్నారు. వివిధ వర్గాలలో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మంగళగిరిలో తన విజయం ఈసారి ఖాయమని చెప్పడమే కాదు, భారీ మెజారిటీతో గెలవాలని చూస్తున్నారు. మంగళగిరి మీద లోకేష్ అంతలా ఫోకస్ పెట్టడానికి కారణం ఉంది. గతసారి లోకేష్ మంత్రిగా ఉంటూ టీడీపీ అధికారంలో ఉన్న వేళ అమరావతి రాజధానికి పక్కనే ఉన్న మంగళగిరిలో పోటీ చేస్తే అయిదు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు.
దాంతో ఓడిన చోటనే గెలవాలని పట్టుదలతో లోకేష్ మంగళగిరిని ఎంచుకున్నారు. ఈసారి ఆయన ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే పని మొదలెట్టేసారు. ఇపుడు చూస్తే ఆయన ఒక వ్యూహం ప్రకారం దూసుకుపోతున్నారు వైసీపీ విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణా రెడ్డిని కాదనుకున్నాక న గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చింది.
ఆ తరువాత ఆయన్ని కాదని మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చింది. వైసీపీ ఇలా లోకేష్ మీద ప్రత్యర్ధి అంటూ ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటే లోకేష్ కి అది అడ్వాంటేజ్ గా మారిపోతోంది. గంజి చిరంజీవిని తప్పించడం మురుగుడు లావణ్యకు ఇవ్వడంతో మంగళగిరిలో వైసీపీ స్పీడ్ కొంత తగ్గిందని అంటున్నారు.
మరో వైపు లోకేష్ తనకు గెలుపు కాదు మెజారిటీ ఎంత అన్నది ముఖ్యమని అంటున్నారు. యాభై వేలకు తక్కువ కాకుండా గెలుస్తాను అని ఆయన ధీమాగా చెబుతున్నారు. మంగళగిరిలో రెండు సార్లు వరసగా వైసీపీ గెలిచింది. ఆ రెండు సార్లూ ఆళ్ల గెలిచారు. ఈసారి కూడా తనకే టికెట్ ఇస్తారని హ్యాట్రిక్ విజేత అవుతాను అని ఆయన అనుకున్నారు. కానీ వైసీపీ సామాజిక సమీకరణలకు తెర తీసింది.
చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉంటే మంగళగిరిలో ఆ సామాజిక వర్గం నుంచే అభ్యర్ధిని ఎంపిక చేసింది. అరవై వేల దాకా ఓట్లు ఆ సామాజిక వర్గానికి ఉన్నాయి. ఓవరాల్ గా బీసీ ఓట్లు ఎక్కువ ఇక్కడ. దాంతో సోషల్ ఇంజనీరింగ్ చేసిన వైసీపీ ఆ రూట్ కరెక్ట్ అనుకుంది. కానీ నారా లోకేష్ మాత్రం ఈ విషయాలను పక్కన పెట్టి అన్ని వర్గాలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఇక టీడీపీ విషయం చూసుకుంటే ఎపుడో 1985లో ఆ పార్టీ చివరిసారిగా గెలిచింది. అంటే దాదాపుగా నలభై ఏళ్ల తరువాత ఇపుడు టీడీపీ గెలిస్తే మాత్రం ఆ క్రెడిట్ లోకేష్ దే అని అంటున్నారు. అమరావతి రాజధానిని టీడీపీ అధికారంలోకి వస్తే గెలిపిస్తామని అంటూ ఆయన హామీ ఇస్తున్నారు. సహజంగానే అమరావతి ప్రాంతం కావడంతో వైసీపీ మీద వ్యతిరేకత ఉంటే అది టీడీపీకి మొగ్గు అయ్యేలా ఉంది.
అయితే ఇక్కడ చూస్తే మరో విషయం ఉంది. చేనేతలకు ఎమ్మెల్యే పదవి దక్కి పదిహేనేళ్ళు అవుతోంది. 2009లో చివరిసారిగా ఆ సామాజిక వర్గం నుంచి అభ్యర్ధి ఎమ్మెల్యే అయ్యారు. దాంతో ఈసారి వైసీపీ ఇచ్చిన చాన్స్ ని సద్వినియోగం చేసుకోవాలని ఆ సామాజిక వర్గం భావిస్తోంది అని అంటున్నారు. దాంతో లోకేష్ కి ఇది కొంత టఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 2014 ఎన్నికల్లో చూసుకుంటే గంజి చిరంజీవి కేవలం 12 ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. అంటే ఆయన గెలుపు వెనక చేనేత సామాజిక వర్గం నూరు శాతం నిలిచారు అని అర్థం చేసుకోవాలి.
ఈసారి చూస్తే అధికారం లో వైసీపీ అండగా ఉంది కాబట్టి బీసీలు అంతా ఒక్క తాటి మీదకు వస్తే మాత్రం అది నారా లోకేష్ కి ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. అయితే ఇక్కడ కాపులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. జనసేనతో పొత్తు ఉంది కాబట్టి టీడీపీ కొంత ధీమాగా ఉంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే లోకేష్ కేవలం మంగళగిరికే పరిమితం కావడం అంటే ఆయన ఈసారి ఎలాగైనా గెలిచి రికార్డు క్రియేట్ చేయాలని పట్టుదలతో ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.