స్వయంప్రకటితం... లోకేష్ రెడ్ బుక్ లో ఏముందంటే..?

ఏపీ రాజకీయాల్లో లోకేష్ యువగళం పాదయాత్ర మొదలైనప్పటి నుంచీ "రెడ్ బుక్" అనే పేరు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే

Update: 2024-01-26 03:46 GMT

ఏపీ రాజకీయాల్లో లోకేష్ యువగళం పాదయాత్ర మొదలైనప్పటి నుంచీ "రెడ్ బుక్" అనే పేరు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే పేరు టీడీపీ కేడర్ లో ధైర్యాన్ని ఇస్తే... ఇదే పేరు రాజకీయ ప్రత్యర్థులకు, ప్రధానంగా అధికార వైసీపీకి బలంగా మారిందనే కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా లోకేష్ ఈ రెడ్ బుక్ లో ఏముంది అనే విషయాలపై ఆన్ లైన్ వేదికగా స్పందించారు.

అవును... యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేతిలో కనిపించిన "రెడ్ బుక్" తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ బుక్ పేరు చెప్పి వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇక కొడాలి నాని, పేర్ని నాని, ఆర్కే రోజా వంటివారి సంగతైతే చెప్పే పనేలేదు.. చినబాబుని బంతాడేశారు. ఇలా ఎవరు ఎలా రెస్పాండ్ అయినా.. ఈ బుక్, దాని ఉద్దేశ్యంపై లోకేష్ స్పందించారు.

ఇందులో భాగంగా.. "అధికారులు, పోలీసులు ఎప్పుడూ సరైన పంథాలో నడుచుకోవాలన్నది టీడీపీ సిద్ధాంతం. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అధికారులకు ఎలాంటి వేధింపులు ఉండవు, వారిపై చర్యలు తీసుకోం. అయితే గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో అధికార దుర్వినియోగం, వ్యవస్థలను భ్రష్టుపట్టించడం జరిగింది" అని మొదలుపెట్టారు. చర్యలు తీసుకోని పక్షంలో ఈ బుక్ లో పేర్లు ఎందుకు రాశారనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ విషయంపై లోకేష్ మరింత వివరణ ఇచ్చారు.

ఇందులో భాగంగా.. "ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ, అధికారపార్టీ సాగిస్తున్న అరాచకాలను నిలదీస్తున్న విపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు, బెదిరింపులకు గురిచేసేందుకు కొందరు కళంకితులైన అధికారులు బరితెగించారు! ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘనలకు గురైన బాధితుల కష్టాలను ఈ "రెడ్ బుక్" లో రాసుకోవడం జరిగింది. ఈ సమయంలో... చట్టప్రకారం వారికి న్యాయం జరుగుతుందని దీని ద్వారా హామీ ఇస్తున్నాం" అని చెప్పారు.

అంటే... ఇంతకాలం నారా లోకేష్ రెడ్ బుక్ లో రాసింది... అధికారంలోకి వస్తే రివేంజ్ తీసుకోవడానికి రాసుకున్న పలువురి అధికారుల పేర్లు కాదట! ఈ "రెడ్ బుక్" లో చాలా మంది అనుకుంటున్నట్లుగా అధికారుల జాబితా కాకుండా... తాజా చెబుతున్నట్లుగా ప్రజల సమస్యల జాబితా ఉంటుంది అని లోకేష్ చెబుతున్నారు.

ఈ మేరకు తాజాగా ఈ విషయాలను వెల్లడిస్తూ అని నారా లోకేష్ ట్విట్టర్ లో ఈ విషయాలను వెల్లడించారు. దీంతో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News