తనతో చేరమంటున్న లోకేష్... పాదయాత్రకు బ్రేక్?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే

Update: 2023-09-11 09:58 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా నిరసనకార్యక్రమాలూ చేస్తుండగా.. పోలీసులు అరెస్టులు చేస్తున్నారని కథనాలొస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... తన తండ్రి అరెస్టు పై నారా లోకేష్ కీలకంగా స్పందించారు.

అవును... చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ మీద పంపిన అనంతరం లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన తండ్రి ఏ తప్పూ చేయలేదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తన రక్తం మరిగిపోతుందని చెప్పిన లోకేష్... తనతో కలిసి రావాలని ప్రజలను పిలుపునిచ్చారు.

చేయని నేరానికి తన తండ్రి అన్యాయంగా రిమాండ్‌ చేయడం చూసి తన కోపం కట్టలు తెంచుకుంటోందని, రక్తం మరుగుతోందని నారా లోకేష్ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా కక్షసాధింపు చర్యలు, విధ్వంసక రాజకీయాలకు ఆయన ఎప్పుడూ పాల్పడలేదని చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో... బరువెక్కిన హృదయంతో, కన్నీటితో తడిసిన కళ్లతో ఈ రోజు ఇది రాస్తున్నానని ట్వీట్‌ లో పేర్కొన్న లోకేష్... "ఆంధ్రప్రదేశ్‌, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన శక్తిని ధారపోయడం చూస్తూ పెరిగా. లక్షలాది మంది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఆయనకు విశ్రాంతి రోజంటూ తెలియదు. ఆయన రాజకీయాలు ఎప్పుడూ హుందాతనంగా, నిజాయతీగా ఉంటాయి" అని అన్నారు.

అనంతరం.. "సేవలను పొందినవారి ప్రేమ, కృతజ్ఞతల నుంచి ఆయన ఆస్వాదించిన లోతైన ప్రేరణను చూశా. వాళ్ల కృతజ్ఞతలు ఆయనలో స్వచ్ఛమైన ఆనందాన్ని నింపాయి. అవి పిల్లల ఆనందానికి సమానమైనవి. నేనూ ఆయన నుంచి ప్రేరణ పొంది అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదులుకొని భారత్‌ కు తిరిగొచ్చా" అని ట్వీట్‌ లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలకు లోకేష్ బలంగా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా... "ఈ రోజు ద్రోహంలా అనిపిస్తోంది. మా నాన్న పోరాటయోధుడు. నేను కూడా అంతే. ఏపీ కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం తిరుగులేని శక్తితో మేం ఎదుగుతాం. ఈ యుద్ధంలో నాతో చేరమని మిమ్మల్ని కోరుతున్నా" అని లోకేష్ పిలుపునిచ్చారు.

మరోవైపు యువగళం పాదయాత్రకు లోకేష్ కొన్ని రోజులపాటు విరామం ఇవ్వనున్నారని తెలుస్తుంది. పాదయాత్ర శుక్రవారం నాటికి డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడకు చేరుకుంది. అక్కడనుంచి శనివారం విజయవాడకు వచ్చేశారు లోకేష్. ఈ నేపథ్యంలో కాస్త పరిస్థితులు సర్దుకున్నాక పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తారని తెలుస్తుంది.

Tags:    

Similar News