ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు!

మరోపక్క వారానికి నాలుగు రోజులు మాత్రమే పని అంటూ జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-11-15 12:50 GMT

వారానికి పని దినాలు ఎన్ని ఉండాలి అనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ చర్చ మరింత బలంగా జరుగుతోంది. ఈ సమయంలో వారానికి ఐదు పని దినాలు, రోజుకు 8 గంటలు పని ఉండటం అన్ని రకాలుగా ఉద్యోగికి, సంస్థకూ శ్రేయస్కరమనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి.

మరోపక్క వారానికి నాలుగు రోజులు మాత్రమే పని అంటూ జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోక్యోలోని అకికో యెకోహోమా అనే సంస్థ శని, ఆదివారాలతోపాటు బుధవారం కూడా సెలవు ఇస్తోంది. దీనివల్ల ఉద్యోగులు ఒత్తిడికి గురికాకుండా చురుగ్గా ఉంటున్నారని.. పని వేగం మెరుగైందని వెల్లడించింది.

అయితే.. ఇటీవల వారానికి 70 గంటలు శ్రమించాలంటూ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఆయన తీవ్ర విమర్శలు కూడా చేశారు. దీనిపై స్పందిస్తూ.. ప్రతిభ, తెలివితేటలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ శ్రమించడమే దేశానికి అవసరమన్నారు. ఈ నేపథ్యంలో.. పని గంటలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు నారాయణ మూర్తి!

అవును... సీ.ఎన్.బీ.సీ. గ్లోబల్ లీడర్ షిప్ సదస్సులో మాట్లాడిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి... వారానికి ఆరు పని దినాల విధానానికె తుదివరకూ తన మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రధాని మోడీ తీవ్రంగా శ్రమిస్తున్నారని.. మనం కూడా అలానే కష్టపడటమే అతనికి ఇచ్చే గౌరవం అని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా... తాను రోజుకు 14 గంటల చొప్పున వారానికి ఆరున్నర రోజులు పనిచేసేవాడినని నారాయణమూర్తి పేర్కొన్నారు. ఇందులో భాగంగా... ప్రతిరోజూ ఉదయం 6:30 గంటలకే ఆఫీసుకు చెరుకుని.. రాత్రి 8:40కు పని ముగించేవాడినని తెలిపారు. ఇదే సమయంలో.. తాను ఆ రకంగా కష్టపడి పనిచేయడానికి గర్విస్తానని అన్నారు.

ఈ క్రమంలో.. శ్రమించడం అనేది వ్యక్తిగత ఎంపిక కాదని చెప్పిన నారాయణమూర్తి.. అది చదువుకున్న ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్ లో ఎలాంటి మినహాయింపులూ లేవని.. అంకితభావంతో పనిచేయడమే భారతీయ సంస్కృతి అని తెలిపారు. దీంతో.. మరోసారి నారాయణ మూర్తి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి!

Tags:    

Similar News