నారాయణ.. నారాయణ.. ఇదేం వ్యాపారం స్వామీ ..!
విద్యార్థులపై ఏటా ఫీజుల భారం పెరిగిపోతోందని తల్లి దండ్రులు ఒకవైపు విలవిల్లాడుతున్నారు.;

విద్య నిగూఢ గుప్తమగు విత్తము! అన్నారు భతృహరి!!. విద్యార్థులకు ఇది ఎంత మేరకు నిగూఢమైన సొ మ్ముగా ఉంటుందో తెలియదు కానీ.. మారుతున్న విద్యావ్యవస్థ పోకడలు చూస్తే.. తల్లిదండ్రులకు చిర్రెత్తు కొస్తోంది. విద్య ఒకప్పుడు దానంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఫక్తు వ్యాపార వస్తువుగా మారిపోయిందన్నది అందరూ అంగీకరించే సత్యం. కొద్దిపాటి పెట్టుబడితో నికర ఆదాయ వనరుగా మారిన విద్యలో ఇప్పుడు.. మరో కొత్త పోకడ కూడా తెరమీదికి వచ్చింది.
విద్యార్థులపై ఏటా ఫీజుల భారం పెరిగిపోతోందని తల్లి దండ్రులు ఒకవైపు విలవిల్లాడుతున్నారు. ఎల్ కేజీ విద్యకే రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న సంస్థలు పెరిగిపోతున్నాయి. ఇక, 1 నుంచి 10వ తరగతి అంటే.. ఇంకెన్ని లక్షలో ఊహించుకోవచ్చు. చిన్నపాటి కాన్వెంటు నుంచి ఓ మోస్తరు స్కూలు వరకు ఇదే పంథాను అనుసరిస్తున్నాయి. విద్య ఏమేరకు చెబుతున్నారన్న విషయం పక్కన పెడితే.. వసూలు చేస్తు న్న ఫీజులతోనే తల్లిదండ్రులు ఆపశోపాలు పడుతున్నారు.
ఇక, తాజాగా నారాయణ విద్యాసంస్థల వ్యవహారం మరో దుమారానికి దారి తీసింది. మంత్రి పొంగూరు నారాయణ చైర్మన్‌గా ఉన్న నారాయణ విద్యాసంస్థల్లో ఈ ఏడాది విద్యాసంవత్సరం నుంచి కొత్త తరహా ఫీజులు అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఏటా ఒక్కసారే ఫీజుల మొత్తాన్ని వసూలు చేసుకునేవారు అయితే.. ఇది కట్టలేక.. విద్యార్థులు అప్పులు చేసి.. మరీ చెల్లించాల్సి వస్తోంది.
దీంతో నారాయణ విద్యాసంస్థలు కొత్త పంథాకు తెరదీశాయి. దీనిలో విద్యార్థుల తల్లిదండ్రులకు కట్టాల్సి న ఫీజుల విషయంలో కొంత వెసులుబాటు కల్పించినట్టు కనిపిస్తున్నా.. అదేసమయంలో మరింత బాదు డుకు తెరదీశారు. ఆరు నెలల వరకు నెల నెలా కట్టే ఫీజుల కు ఎలాంటి రుసుములు లేకపోయినా.. 9, 11 మాసాల్లో చెల్లించే ఫీజులపై వడ్డీలు మోపడం ఇప్పుడు వింతగాను.. విచిత్రంగాను ఉండడం గమనార్హం. 9 మాసాల్లో నిర్నీత ఫీజులు చెల్లించేవారు.. నూటికి 2 రూపాయల చొప్పున వడ్డీ కట్టినట్టు అదనంగా చెల్లించాలి.
ఇక, 11 మాసాల వరకు చెల్లించేవారు.. ఏకంగా 3.5 రూపాయల చొప్పున లెక్కించి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మరి ఇదేం బాదుడో.. అర్ధం కావడం లేదని తల్లిదండ్రులు విలపించే పరిస్థితి వచ్చింది. మరి ఈ పోకడకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయకపోతే.. మున్ముందు.. తల్లిదండ్రుల పరిస్థితి దారునంగా మారే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు.