వావ్ అనాల్సిందే: ఎకానమీ క్లాసులో నారాయణమూర్తి!
ముంబయి నుంచి బెంగళూరుకు వెళుతున్నారు నరేన్ క్రిష్ణ. అతనో యువ వ్యాపారవేత్త. అంతమాత్రానికే వార్త అయిపోదు
ముంబయి నుంచి బెంగళూరుకు వెళుతున్నారు నరేన్ క్రిష్ణ. అతనో యువ వ్యాపారవేత్త. అంతమాత్రానికే వార్త అయిపోదు. ఆయన సీటులో కూర్చున్న తర్వాత.. ఆయన పక్క సీట్లో వచ్చి కూర్చున్నారో పెద్ద మనిషి. ఆయన్ను చూసినంతనే ఒక్కసారి షాక్ తిన్న నరేన్.. తన లక్ కు మురిసిపోయారు. ఇంతకూ అతగాడి పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఎవరో కాదు.. ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ సంస్థకు వ్యవస్థాపకుడిగా ఒకరైన ఆ ప్రముఖుడు తన పక్కనే కూర్చున్న విషయాన్ని ఎంతగానో ఆనందించిన అతడు.. తన ప్రయాణ సమయంలో ఆయనతో బోలెడన్ని అంశాలపై చర్చించుకున్నట్లుగా పేర్కొన్నారు.
అంతేకాదు.. దీనికి సంబంధించిన పోస్టును అతడు లింక్డిన్ లో షేర్ చేసుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే విషయం నారాయణమూర్తితో మాట్లాడిన తర్వాతే తనకు అర్థమైందన్న నరేన్ తన ప్రయాణ అనుభవం మీద పోస్టు చేశారు. అందులోని అంశాల్ని చూస్తే.. ''విమానంలో ప్రయాణించిన కొన్ని గంటల్లోనే అసంఖ్యాకమైన విషయాల్ని చర్చించుకున్నాం. ఫ్యూచర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం.. భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుదలలో యువత పాత్ర.. ఆర్థికంగా చైనాను అధిగమించాలంటే ఎలాంటి చర్యలు అవసరం? ఒత్తిడిని తట్టుకోవటం ఎలా? ఒక సంస్థను ినర్వహిస్తున్నప్పుడు ఎదురయ్యే వైఫల్యాల్ని ఎలా అధిగమించాలి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి తమ ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లుగా పేర్కొన్నారు.
ఫలితాలతో సంబంధం లేకుండా ప్రయత్నాలు చేస్తే.. విజయం దానంతట అదే వస్తుందన్న నారాయణమూర్తి.. తన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాల్ని తనతో షేర్ చేసుకున్నారన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వివిధ రంగాల్లో ఉత్పాదకత 10 శాతం నుంచి వంద రెట్లు పెరుగుతుందన్నట్లుగా పేర్కొన్నారు.తనతో మాట్లాడిన సందర్భంలో నారాయణ మూర్తి చెప్పిన మాటల్లో ఒక మాట తనను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. 'మనసు పెట్టి పని చేస్తే.. ప్రతి అవకాశం అనుకూలంగా మారుతుంది' అన్న మాట తనను ఎంతగానో ఆలోచించేలా చేసిందన్నారు.
రాబోయే రోజుల్లో ఆవిష్కరణాలు చాలా వేగంగా చోటు చేసుకుంటాయని నారాయణ మూర్తి తనతో చెప్పారన్నారు. అనుకోని రీతిలో ఒక గొప్ప వ్యక్తిని కలవటం.. ఆయనతో కలిసి కొన్ని గంటల పాటు ప్రయాణించటం జీవితంలో తాను మార్చిపోలేనని పేర్కొంటూ నరేన్ పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. వేలాది కోట్లు ఉన్నప్పటికీ సాధారణ ప్రయాణికుడి మాదిరి ఎకానమీ క్లాస్ లో ఆయన ప్రయాణించటం తనను సర్ ప్రైజ్ చేసిందంటూ నరేన్ పేర్కొన్నారు.