పాక్ నుంచి అమెరికా దాకా.. ఏడాదికి 8 దేశాలు.. మోదీ ‘వరల్డ్ ట్రావెల్’

మోదీ తరచూ విదేశీ పర్యటనల వెనుక భారత విదేశాంగ విధానాన్ని చాటే ఉద్దేశమే.

Update: 2025-02-10 12:30 GMT

దాదాపు పదిన్నరేళ్లు.. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి. ఈ వ్యవధిలో బహుశా ఆయన ఏ భారత ప్రధాని కూడా చేయనన్ని విదేశీ పర్యటనలు సాగించారు. ఇందులో విశేషం ఏమంటే.. పాకిస్థాన్ నుంచి అమెరికా అనేక దేశాలను మోదీ చుట్టి వచ్చారు. చాలామంది భారత ప్రధానులు పాకిస్థాన్ వెళ్లకుండా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. మోదీ అలా కాదు అఫ్ఘానిస్థాన్ లోనూ పర్యటించారు.

మోదీ తరచూ విదేశీ పర్యటనల వెనుక భారత విదేశాంగ విధానాన్ని చాటే ఉద్దేశమే. గత పదేళ్లలో వివిధ దేశాలతో కొత్తగా కుదిరిన ఒప్పందాలే దీనికి నిదర్శనం. మరోవైపు మోదీ పర్యటనల ద్వారా భారత్ కు ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం, గుర్తింపు దక్కాయి.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యేందు మోదీ మరోసారి ఆ దేశానికి వెళ్తున్నారు. పనిలోపనిగా ఫ్రాన్స్ లోనూ ఆగనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తో భేటీ కానున్నారు. కాగా 2014లో బాధ్యతలు చేపట్టిన దగ్గరనుంచి మోదీ 86 దేశాల్లో పర్యటించారు.

మన పొరుగున్న బుల్లి దేశం భూటాన్ తో మోదీ తన విదేశీ పర్యటనలను మొదలుపెట్టడం గమనార్హం. 2014 జూన్ 15, 16 తేదీల్లో ఆయన భూటాన్ లో పర్యటించారు. ఆ వెంటనే జూలై 13-17 మధ్యన బ్రెజిల్‌, ఆగస్టు 3-4 తేదీల్లో నేపాల్, జపాన్ (ఆగస్టు 30- సెప్టెంబర్ 3, 2014)లను సందర్శించారు.

ఇక ఒబామా అధ్యక్షుడిగా ఉండగా అమెరికా (26, 2014 - సెప్టెంబరు 30, 2014)లో మోదీ టూర్ చేశారు. మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీలలో 2014 నవంబరు 11-19న, నేపాల్ లో 2014 నవంబర్ 25-27 కాలంలో పర్యటించారు.

మంగోలియానూ వదలకుండా..

మోదీ అర్జెంటీనా నుంచి అఫ్ఘానిస్థాన్ వరకు చాలా దేశాల్లో టూర్ చేశారు. వీటిలో భారత ప్రధానులు ఎవరూ వెళ్లని దేశాలూ ఉన్నాయి. ఉదాహరణకు మంగోలియా. బాహ్య ప్రపంచంతో పెద్దగా సంబంధాలు ఉండని ఈ దేశంలోనూ మోదీ పర్యటించారు. ఇలానే మనతో విభేదాలు తీవ్రంగా ఉన్న చైనానూ సందర్శించారు. రష్యా, అమెరికా వంటి దేశాలకు పలుసార్లు వెళ్లారు.

ఉక్రెయిన్ కూ టూర్..

మోదీ పర్యటనల జాబితాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉక్రెయిన్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మనది శాంతి పక్షం అని చెబుతున్న మోదీ గత ఏడాది మూడోసారి గెలిచాక రష్యా వెళ్లి దాని అధ్యక్షుడు పుతిన్ ను ఆలింగనం చేసుకోవడం సంచలనం రేపింది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే ఉక్రెయిన్ లోనూ టూర్ చేశారు మోదీ. ఒకప్పుడు జాతుల వైరంతో అట్టుడికిన రువాండా, ఉగాండాలతో పాటు కజకిస్థాన్, కిర్గిజిస్థాన్ లోనూ మోదీ పర్యటించడం విశేషం.

సీషెల్స్, పపువా న్యూ గినియా వంటి అతి చిన్న ద్వీప దేశాల్లోనూ మోదీ పాదం మోపడం కొసమెరుపు. మరో నాలుగున్నరేళ్లు ఆయన ప్రధానిగా ఉండనున్నారు. ఈ వ్యవధిలో ఇంకెన్ని పర్యటనలు చేస్తారో..? వంద దేశాలను చుట్టొచ్చి సెంచరీ కొడతారేమో?

Tags:    

Similar News