మోడీ కల తీరలేదు.. ఆ పాలిటిక్సే కొంప ముంచాయా?
ప్రధాని నరేంద్ర మోడీ .. ఈ సారి జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సుపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ .. ఈ సారి జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సుపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. `వసుధైక కుటుంబం`- థీమ్‌తో ఆయన ఈ సదస్సులో ప్రపంచ దేశాల వాణిజ్య, వ్యాపార వేత్తలను ఆకర్షించి.. సెమీ కండక్టర్ రంగంలోనే కాకుండా.. ఏఐలోనూ పెట్టుబడులు పెట్టించాలని భావించారు. ఈ క్రమంలోనే గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఐదుగురు కేంద్ర మంత్రులను ఈ సదస్సుకు పంపించారు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న దావోస్ పర్యటనకు ఈ బృందం తరలి వెళ్లింది.
వీరిలో అశ్వినీ వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, సీఆర్ పాటిల్ వంటి దిగ్గజ నాయకులు ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు నాలుగు రోజుల పాటు జరిగిన సదస్సులో భారత్కు ప్రత్యేకంగా ఒరిగిన లబ్ధి అంటూ ఏమీ కనిపించలేదు. రాష్ట్రాలపరంగా చూసుకుంటే.. బీజేపీ పాలిత మహారాష్ట్రకు కేవలం 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. కేంద్రం పరంగా చూసుకుంటే.. ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. కేవలం వస్తామని మాత్రమే హామీలు గుప్పించాయి.
ఇక, కాంగ్రెస్ పాలిత తెలంగాణకు మాత్రం ఊహించని విధంగా అంచనాలకు మించి పెట్టుబడులు లభించాయి. దీంతో భారత్ తరఫున దావోస్‌కు వెళ్లిన కేంద్ర బృందం ఉత్తచేతులతోనే శుక్రవారం తిరిగి రానుంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు తిరిగి వచ్చేశారు. మరి దీనికి కారణం ఏంటి? మోడీ పెట్టుకున్న కలలు ఎందుకు సాకారం కాలేదన్న చర్చ తెరమీదికి వచ్చింది. అంతర్గత రాజకీయాలు.. ఐటీ దాడులు.. ఈడీ దాడులు సీబీఐ కేసులు వంటివి ప్రధానంగా భారత్ ఇమేజ్‌ను మసకబారుస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా బీజేపీ యేతర పార్టీలు పాలన సాగిస్తున్న రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులపై పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా చర్చ జరగడం.. బీబీసీ వంటి సంస్థలను నియంత్రించేలా చర్యలు ఉండడం.. అంతర్జాతీయ పెట్టుబడి దారుడుగా ఉన్న గౌతం అదానీ వ్యవహారం ఇటీవల కాలంలో వివాదం కావడం వంటివి ప్రపంచ వాణిజ్య, వ్యాపార వేత్తలను ప్రభావితం చేస్తున్నాయన్నది ఆర్థిక నిపుణుల అంచనా. తమకు సుస్థిర త్వం కోరుకునే వ్యాపారులు ఈ క్రమంలో భారత్‌ను పక్కన పెట్టారన్న విషయాన్ని కూడా వారు చెబుతున్నారు.