కొత్త సీన్: పార్లమెంట్ ఆవరణతో మీడియాతో మోడీ మాటలు!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోకి వచ్చేసరికి ఈ తీరు తగ్గిపోయింది. ఏడాదికి ఒకట్రెండుసార్లు మాత్రమే మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడేవారు.

Update: 2024-11-26 04:45 GMT

దేశం ఇప్పటివరకు పలువురు ప్రధానమంత్రుల్ని చూసింది కానీ.. నరేంద్ర మోడీ లాంటి భిన్నమైన ప్రధానిని మాత్రం ఇప్పుడే చూస్తోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రధానమంత్రి పదవీ కాలాన్ని పూర్తి చేసిన నరేంద్ర మోడీ.. ముచ్చటగా మూడోసారి ఆయన ప్రధానిగా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ప్రధానమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన వారు ఎవరైనా సరే.. తమ పదవీ కాలంలో మీడియాతో మాట్లాడటం.. వారితో తమ పాలనా విషయాల్ని పంచుకోవటం.. సమకాలీన రాజకీయాల గురించి వ్యాఖ్యలు చేయటం లాంటివి ఉండేవి.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోకి వచ్చేసరికి ఈ తీరు తగ్గిపోయింది. ఏడాదికి ఒకట్రెండుసార్లు మాత్రమే మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడేవారు. మోడీ వచ్చిన తర్వాత అదీ పోయింది. గత ఎన్నికలకు ముందు మాత్రం.. పెద్ద ఎత్తున మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. కట్ చేస్తే.. పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడటం ఇదే మొదటిసారిగా చెప్పొచ్చు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఒకవేళ గతంలోనూ మాట్లాడి ఉన్నా.. వేళ్ల మీద లెక్క పెట్టే సందర్భాలుగా చెప్పక తప్పదు.

తాజాగా మీడియాతో మాట్లాడటం వెనుక మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించటంతో పాటు.. విపక్షాలపై విరుచుకుపడేందుకు అవకాశం ఉండటంతో ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవటానికి మాట్లాడారని చెప్పాలి. ఈ వాదనకు తగ్గట్లే.. విపక్షాలపై ఘాటు విమర్శలు చేశారు ప్రధాని మోడీ. ఎన్నికల్లో పదే పదే ప్రజల చేతిలో తిరస్కరణకు గురైనా సరే.. కొన్ని పార్టీలు పార్లమెంట్ మీద పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయన్నారు.

రాజ్యసభ.. అసెంబ్లీలకు జరిగిన వేర్వేరు ఎన్నికల్లో ఇప్పటివరకు 80-90 సార్లు ఓటమిని చవి చూసిన తర్వాత కూడా విపక్షాలు తమ తీరును మార్చుకోవటం లేదన్న అసహనాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి.. ‘‘పార్లమెంట్ లో ఆరోగ్య చర్చ జరగాలి. కొందరు వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంట్ ను నియంత్రించటానికి ప్రయత్నిస్తున్నారు. అంతరాయాలు.. గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. విపక్ష పార్టీలు.. ఆ పార్టీల నేతలు పార్లమెంట్ లో చర్చలు జరగనివ్వట్లేదు’’ అని పేర్కొన్నారు.

‘‘ప్రజాస్వామ్య సూత్రాలను.. ప్రజల ఆకాంక్షలను గౌరవించరు. ప్రజల పట్ల తమకున్న బాధ్యతను గుర్తించటం లేదు. పనిగట్టుకొని మరీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వారి వైఖరిని ప్రజలు ఒక కంట కనిపెడుతున్నారు. టైం వచ్చినప్పుడు తగిన శిక్ష విధిస్తుననారు. ప్రతిపక్షాల ప్రవర్తన కొత్త ఎంపీల హక్కుల్ని అణిచివేస్తోంది. వారు సభలో మాట్లాడే అవకాశాన్ని కోల్పోయేలా చేస్తోంది’’ అని చెప్పారు.

కొన్నివిపక్ష పార్టీలు సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని ముందుకు వస్తున్నప్పటికి.. ఆ పార్టీల మనసుల్ని మిత్రపక్షాలు మార్చేస్తున్నాయని ఆరోపించారు. నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపు ఆశగా ఎదురుచూస్తుందని.. అందుకు అనుగుణంగా దేశ గౌరవాన్ని.. ఖ్యాతిని ఇనుమడించేలా సభ్యులు సభా సమయాన్ని వినియోగించుకోవాలన్నారు. మొత్తంగా చూస్తే.. తమకు ప్రజల మద్దతు ఉందని.. ఎన్నికల్లో విజయం ద్వారా ఆ విషయం స్పష్టమవుతుందన్న మాటను చెబుతూనే.. ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత కూడా విపక్ష పార్టీలు తమ తీరును మార్చుకోవటం లేదన్న విషయాన్ని మోడీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి.

Tags:    

Similar News