భారత్ లో డిజిటల్ అరెస్టులు... ఆ మూడు దేశాలు, ఈ మూడు విషయాలు!
"మన్ కీ బాత్" కార్యక్రమంలో సైబర్ నేరాల తీవ్రతను గురించి ప్రధాన మంత్రి మోడీ స్పందించారు.
"క్షణం ఆగండి.. ఆలోచించండి.. ఆ తర్వాతే స్పందించండి.." అనేదాన్ని మంత్రంగ పాటిస్తే ప్రజలు ఆన్ లైన్ స్కాముల నుంచి బయటపడవచ్చని "మన్ కీ బాత్" కార్యక్రమంలో సైబర్ నేరాల తీవ్రతను గురించి ప్రధాన మంత్రి మోడీ స్పందించారు. ఏకంగా ప్రధానే స్పందించడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ చర్చ తీవ్రంగా నడుస్తుంది.
అవును... "డిజిటల్ అరెస్టు"ల పేరిట ఆన్ లైన్ లో జరుగుతున్న మోసాలను ప్రధాని మోడీ ఆదివారం "మన్ కీ బాత్" లో ప్రస్థావించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. దీంతో... ఇటీవల వీటికి సంబంధించి కేంద్ర హోంశాఖ వెల్లడించిన కీలక సమాచారం హాట్ టాపిక్ గా మారింది.
ఇందులో భాగంగా... భారత్ లో ఈ తరహా మోసాలు ప్రధానంగా... మూడు విషయాలపై, మూడు దేశాల నుంచి జరుగుందని గుర్తించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... ట్రేడింగ్, రొమాన్స్, ఇన్వెస్ట్ మెంట్ అనే మూడు విషయాల్లో మోసాలు జరుగుతుండగా.. మూడు దేశాలే కేంద్రంగా ఈ స్కామ్స్ జరుగుతున్నాయని అంటున్నారు.
ఇందులో భాగంగా... పొరుగున ఉన్న మయన్మార్ తో పాటు కంంబోడియా, లావోస్ కేంద్రంగా ఈ ఆన్ లైన్ మోసాల ముఠాలు చెలరేగిపోతున్నాయని హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మూడు దేశాల నుంచే దాదాపుగా 46 శాతం మోసాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఇప్పటివరకూ సుమారు రూ.1,776 కోట్లు బాధితుల నుంచి దోచుకున్నారని చెబుతున్నారు! ఇందులో గరిష్టంగా ట్రేడింగ్ స్కాముల్లో రూ.1,420 కోట్లు, ఇన్వెస్ట్ మెంట్ స్కాముల్లో రూ.222.58 కోట్లు, డిజిటల్ అరెస్టుల్లో రూ.120 కోట్లు, రొమాన్స్ /డేటింగ్ పేరున రూ.13.23 కోట్ల మోసాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి!
ఇదే సమయంలో 2021లో ఈ ఆన్ లైన్ మోసాలపై అందిన ఫిర్యాదుల సంఖ్య 4.52 లక్షలుగా ఉండగా.. 2022లో వీటి సంఖ్య 9.66 లక్షలు, 2023లో 15.56 లక్షలుగా ఉంది. ఇక ఈ ఏడాది మొదటి నాలుగు నెలలు (జనవరి - ఏప్రిల్) లోనే మొత్తం 7.4 లక్షల ఫిర్యాదులు వచ్చాయని చెబుతున్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు!