మోడీ నామినేషన్‌కు పెళ్లిని మించిన ఏర్పాట్లు!
ఎన్నికల్లో గెలవడం కీలకం. దీనికి నాయకులు ఎన్నో వ్యయ ప్రయాసలు తీసుకుంటారు
ఎన్నికల్లో గెలవడం కీలకం. దీనికి నాయకులు ఎన్నో వ్యయ ప్రయాసలు తీసుకుంటారు. అయితే.. దీనికి ముందే.. ఒక హైప్ క్రియేట్ చేసేందుకు.. నాయకులు చేసే ప్రయత్నం నామినేషన్ ఘట్టాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం. నామినేషన్ ఘట్టాన్ని ఎంత భారీగా నిర్వహిస్తే.. ఓటర్లలో అంత హైప్ పెంచేయొచ్చనేది అభ్యర్థుల ఐడియా. అందుకే రాష్ట్రంలోనూ దేశంలోనూ నామినేషన్ల ఘట్టానికి ప్రాధాన్యం ఏర్పడుతోంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన నామినేషన్ వేసేందుకు భారీగా తరలి వెళ్లిన విషయం తెలిసిందే.
ఇక, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ వంతు వచ్చింది. ఈయన ప్రచారం పీజ్ స్టేజ్‌లో కోరుకునే వ్యక్తి అన్న సంగతి తెలిసిందే కదా! సో.. ఇప్పుడు ఆయన కూడా భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ రేంజ్‌లో అంటే.. ఓ కుబేరుడి ఇంట్లో పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో .. ఆ రేంజ్‌లో యూపీ బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారణాసి నుంచి వరసుగా గెలుస్తున్న మోడీ... ఇప్పుడు మూడో సారి కూడా అక్కడ నుంచే పోటీకి రెడీ అయ్యారు.
ఈ నెల 14న నామినేషన్ వేసేందుకు మోడీ రెడీ అయ్యారు. ఇక, ఆరోజు ఏకంగా ఐదు కిలో మీటర్ల మేర భారీ ఎత్తున రోడ్ షో చేపట్టనున్నారు. దారి పొడవునా.. పూల దండలు.. పట్టపగలే మిరిమిట్లు గొలిపే.. కాంతులతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, దారికిఇరు వైపులా.. లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరిస్తున్నారు. వారణాసి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలను సమీకరిస్తున్నారు. ఇలా వచ్చేవారికి ప్రత్యేక డ్రస్ కోడ్ పెట్టారని బీజేపీ వర్గాలు తెలిపాయి. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.
సుమారు ఐదు కిలోమీటర్ల రోడ్ షోను 3 నుంచి 4 గంటల పాటు నిర్వహిస్తారని తెలిపారు. రోడ్ షో కాశీ విశ్వనాథ్ కారిడార్ వరకు కొనసాగుతుంది. లక్షలాది మంది ఈ రోడ్ షోలో పాల్గొనేలా ప్లాన్ చేశారు. ఈ రోడ్ షో చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేయడం గమనార్హం. 2014లో తొలిసారి ఇక్కడ నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన.. మోడీ విజయం దక్కించుకున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన విజయంసాధించారు.