ఉక్రెయిన్ పర్యటనలో ప్రధాని మోడీ చేస్తున్న మరో సాహస యాత్ర
ఈ ట్రైన్ అల్లాటప్పా కాదు. అత్యంత విలాసవంతమైన.. సురక్షితమైన ట్రైన్ గా చెబుతున్నారు.
ఒకటి తర్వాత ఒకటి చొప్పున విదేశీ పర్యటనలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అత్యంత సాహసోపేతంగా ఉక్రెయిన్ టూర్ ను ఎంచుకోవటం తెలిసిందే. మరో రెండు రోజుల్లో (ఆగస్టు 23న) ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ కోసం ఆయన పెద్ద రిస్కే తీసుకుంటున్నారా? అన్నది చర్చగా మారింది. ఎందుకంటే.. ఆ దేశ రాజధాని కీవ్ కు చేరుకోవటానికి మిగిలిన దేశాధినేతల మాదిరి విమానంలో కాకుండా ట్రైన్ జర్నీలో రాజధాని కీవ్ కు చేరుకోనున్నారు. ఇందుకోసం పది గంటలకు పైగా ఆయన ట్రైన్ జర్నీ చేయనున్నారు.
ఈ ట్రైన్ అల్లాటప్పా కాదు. అత్యంత విలాసవంతమైన.. సురక్షితమైన ట్రైన్ గా చెబుతున్నారు. ట్రైన్ ఫోర్సు వన్ లో ప్రధాని మోడీ ప్రయాణిస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. గడిచిన ముప్ఫై ఏళ్లలో భారత ప్రధాని ఒకరు ఉక్రెయిన్ లో పర్యటించటం ఇదే తొలిసారి. గడిచిన కొంతకాలంగా రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళలో.. రష్యా అధినేత పుతిన్ కు అత్యంత సన్నిహిత మిత్రుడిగా పేరున్న నరేంద్ర మోడీ ఇప్పుడు ఉక్రెయిన్ లో పర్యటిస్తున్న వైనం ఒక ఎత్తు అయితే.. ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీను కలవటం కోసం ట్రైన్ జర్నీ చేసేందుకు మోడీ డిసైడ్ కావటం ఆసక్తికరంగా మారింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు చేరుకోవటానికి ట్రైన్ లో వెళుతున్న మోడీ.. రాను, పోను జర్నీ కోసం ఏకంగా 20 గంటల పాటు వెచ్చించటం గమనార్హం. ఇక.. ఈ ట్రైన్ విశేషాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే దీన్ని ట్రైన్ అనే కంటే.. విలాసవంతమైన.. సౌకర్యవంతమైన కదిలే ఇంద్ర భవనంగా చెప్పాలి. అత్యంత భద్రతతో పాటు.. విలాసవంతమైన కాబిన్లు ఉంటాయి. మీటింగ్ లకోసం పెద్ద పెద్ద టేబుల్స్.. సోఫా.. టీవీతో పాటు రెస్టు తీసుకోవటానికి అవసరమైన విలాసవంతమైన బెడ్రూం కూడా ఉంది.
యుధ్దం జరుగుతున్న తాజా పరిస్థితుల్లో ఈ ట్రైన్ ను నడపటం అంత తేలికైన విషయం కాదు. అయితే.. మోడీ టూర్ కోసం దీన్ని ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. ఈ లగ్జరీ ట్రైన్ లో గతంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ .. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ లాంటి ప్రపంచ నాయకులు జర్నీ చేశారు. యుద్ధం జరుగుతున్న వేళలో.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జర్నీ పెట్టుకోవటంతో దెబ్బ తిన్న ట్రాక్ ను ప్రత్యేకంగా తనిఖీలు నిర్వర్తిస్తున్నారు. ఈ రైలు ప్రయాణం తర్వాత ఉక్రెయిన్ దేశాధినేత జెలెన్ స్కీతో భేటీ కావటం.. యుద్ధంపైనా మాట్లాడనున్నారు. ఉక్రెయిన్ కంటే ముందు పోలాండ్ కు వెళ్లనున్న మోడీ అక్కడి నుంచి ఉక్రెయిన్ చేరుకుంటారు.