రాముడిని విడవండి...రాజకీయం చాలండి...మోడీకి ఘాటు ట్వీట్!
అయితే తాజాగా మోడీ చేసిన ఒక ట్వీట్ విపక్షాలకు కొత్త ఆలోచనతో పాటు కొత్త ఆవేశాన్ని కూడా రగిలించేలా ఉంది అని అంటున్నారు.
కాదేదీ కవితకు అనర్హం అని మహా కవి శ్రీశ్రీ అన్నారు. దాన్ని కాస్తా కాదేదీ రాజకీయాలకు అనర్హం అని మార్చి చదువుకోవాలి. రాజకీయాల్లో దేవీ దేవతలను తెచ్చేస్తారు. ప్రకృతిని కూడా కలిపేసుకుంటారు. మంచి ఎక్కడ ఉన్నా మాదే అంటారు. ఉమ్మడి ఏపీలో చూస్తే వరుణుడు మా పార్టీ అని నాటి కాంగ్రెస్ సీఎం వైఎస్సార్ గొప్పగా చెప్పుకునేవారు.
దానికి చాన్నాళ్ళ క్రితం అంటే 1988 నుంచే బీజేపీ రాముడిని తమ పార్టీలో చేర్చేసుకుంది. రాముడు బీజేపీ అన్నది రెండూ వేరు కాదు అన్నంతగా జాతీయ స్థాయిలో రాజకీయం సాగింది. అది బీజేపీకి చాలా ఉపయోగపడింది కూడా. 1984లో కేవలం రెండు సీట్లు మాత్రమే కలిగి ఉన్న బీజేపీ 1989 నాటికి తన బలాన్ని డబుల్ చేసుకుంది. 1991 తరువాత సెంచరీ దాటి పరుగులు తీసింది. 1996 నాటికి బీజేపీ ప్రధానమంత్రిగా వాజ్ పేయి అవతరించారు. ఇక 1998 నుంచి 2004 వరకూ బీజేపీ ఆరేళ్ల పాటు దేశాన్ని పాలించింది.
వాజ్ పేయ్ హయాంలో అద్వానీ సారధ్యంలో అయొధ్య రాముడు అన్న నినాదమే బలంగా వినిపించేది. అలా 2004, 2009, 2014, 2019 ఎన్నికల దాకా అదే అజెండాను నడిపించారు. అయితే 2019 తరువాత రెండవసారి నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అయ్యాక రామ మందిరం సమస్యను న్యాయ స్థానాల ద్వారా పరిష్కరించారు. దాంతో ఇపుడు అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం జరుపుకుంటోంది.
అలా అయోధ్యలో కరోనా టైం లో నరేంద్ర మోడీ రామ మందిరానికి పునాది రాయి వేశారు. 2024 జనవరి 23న ఆయన రామ మందిరాన్ని ప్రారంభించబోతున్నారు. ఒక విధంగా రామ మందిరం నిర్మాణంతో ఆ అజెండా పూర్తి అయినట్లే అని అంతా అనుకున్నారు. బీజేపీ అమ్ముల పొది నుంచి అత్యంత కీలకమైన అంశం, మూడున్నర దశాబ్దాలుగా ఉన్న అంశం ఇక పైన లేకుండా పోయింది అని కూడా విశ్లేషించుకున్నారు.
అయితే తాజాగా మోడీ చేసిన ఒక ట్వీట్ విపక్షాలకు కొత్త ఆలోచనతో పాటు కొత్త ఆవేశాన్ని కూడా రగిలించేలా ఉంది అని అంటున్నారు. త్వరలోనే అయోధ్యలోని రామాలయంలోకి శ్రీరాముడు రాబోతున్నాడని, వచ్చే శ్రీరామ నవమికి ఆలయంలో జరిగే పూజలు ప్రపంచానికి ఆనందాన్ని కలిగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
అంటే దీని అర్ధం పరమార్ధం రాజకీయాలు తెలిసిన వారికే ఇంకా బాగా అర్ధం అవుతాయి. శ్రీ రామనవమి వచ్చేనాటికి దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి ఉంటుంది. అలా రాముడు 2024 ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున మరో చాన్స్ ఇప్పించేందుకు సిద్ధంగా ఉంటారా అన్నదే ఇపుడు ఒక ప్రశ్నగా ఉంది. దీని మీద విపక్షాలు హాట్ కామెంట్స్ చేస్తున్నాయి.
ఇక దీనికి సమాధానంగా కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ విమర్శలు గుప్పించారు. రాజకీయ లబ్ధి కోసం శ్రీరాముడిని బీజేపీ వాడుకుంటోందని కపిల్ సిబాల్ ఆరోపించారు. ఎప్పటి నుంచో బీజేపీ నేతలు రాముడిని వాడుకుంటున్నారే కాని ఆ రాముడిలో ఉన్న సద్గుణాలు బీజేపీలో ఏమాత్రం కనిపించడం లేదని ఆయన అన్నారు. అంతే కాదు ఇంకెంత కాలం రాముడిని వాడుకుంటారని ప్రధాని మోదీని ఉద్దేశించి సిబాల్ ప్రశ్నించారు.
ఆయన మోడీ మీద డైరెక్ట్ గానే అటాక్ చేస్తూ శ్రీరాముడిలోని కరుణ ప్రేమ, విధేయత, ధైర్యసాహసాలు, శౌర్యం మీలో కనిపించవని కూడా అంటున్నారు. శ్రీరాముడిలోని సద్గుణాలను మీరు ఎందుకు స్వీకరించరని ప్రశ్నించారు. మొత్తానికి అయోధ్య రామ మందిరం నిర్మాణం జరుపుకున్నా రాముడు మా వాడే ఎప్పటికీ పర్మనెంట్ గా బీజేపీతోనే ఉంటారని కమలనాధులు ఆశపడుతూంటే ఇప్పటికైనా రాముడిని విడవండి అంటున్నాయి విపక్షాలు మరి 2024లో రాముడు ఎంతవరకూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారో చూడాల్సి ఉంది.