52 ఏళ్లు .. 12 రోజులు .. వెయ్యి కిలోమీటర్లు
ఆమె వయసు 52 ఏళ్లు. అయితేనేం 12 రోజులలో ఏకంగా పరుగెత్తుతూ వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.
ఆమె వయసు 52 ఏళ్లు. అయితేనేం 12 రోజులలో ఏకంగా పరుగెత్తుతూ వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. అత్యంత వేగంగా ఈ ఫీట్ ను చేరుకున్న వ్యక్తిగా గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కింది. ఈ ప్రయత్నంలో ఎండలను తట్టుకునేందుకు ఆమె కొన్ని రోజులు అర్ధరాత్రి కూడా పరుగెత్తిందట.
సింగపూర్‌కు చెందిన నటాలీడౌ(52) అనే మహిళ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. కేవలం 12 రోజుల్లో వెయ్యి కిలోమీటర్ల దూరం పరుగెత్తింది. ఈ క్రమంలో ఏకంగా మూడు దేశాలను కూడా చుట్టేసింది. గత మే 25వ తేదీన థాయ్‌లాండ్‌లో పరుగును మొదలుపెట్టిన నటాలీ.. మలేషియా మీదుగా జూన్ 5న సింగపూర్ చేరుకుని ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నది.
మహిళలు, బాలికల ఆరోగ్యం అనే అంశంపై అవగాహన కల్పించడంతోపాటు విరాళాల సేకరణ లక్ష్యంగా ‘ప్రాజెక్ట్ 1000’ పేరిట ఆమె ఈ పరుగును మొదలుపెట్టింది. ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు తన 30వ ఏట పరుగును ప్రారంభించిన నటాలీడౌ ప్రాజెక్ట్ 1000లో భాగంగా రోజుకి 84.2 కిలోమీటర్లు చొప్పున పరుగెత్తడం విశేషం. తాను నిర్దేశించుకున్న 1000 కిమీల లక్ష్యాన్ని ఆమె కేవలం 12 రోజుల్లో పూర్తి చేశారు.
ఈ క్రమంలో ఎండ, వాన, తుంటి గాయం, అనారోగ్యాన్ని కూడా ఆమె లెక్క చేయలేదు. ఎండల నుంచి తప్పించుకునేందుకు కొన్ని రోజులు అర్ధరాత్రి తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజాము వరకు పరుగెత్తింది. ఏదేమైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించిన నటాలీడౌ.. ‘ఫాస్టెస్ట్1000 కిమీ థాయ్‌లాండ్- సింగపూర్ అల్ర్టామారథాన్’ రికార్డును సొంతం చేసుకున్నారు. అంతేకాక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నమోదు చేశారు. ఈ ప్రయత్నంలో తన పరుగుతో నటాలీడౌ క్రీడల ద్వారా మహిళలు, అమ్మాయిల్లో నాయకత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేసే ఓ సంస్థకు 50 వేల డాలర్లు(దాదాపు రూ.42లక్షలు) విరాళాలు సేకరించడం విశేషం.