అసలేం జరుగుతోంది? పవన్ కల్యాణ్ కు భారీ ఎలివేషన్ ఇస్తున్న మీడియా!
ఏమీ ఉత్తినే జరగవు. అందునా రాజకీయాల్లో అలాంటి వాటికి ఛాన్సే ఉండదు. లక్కీగా అత్యున్నత స్థానాల్ని సొంతం చేసుకునే కొందరు నేతలు ఉంటారు.
ఏమీ ఉత్తినే జరగవు. అందునా రాజకీయాల్లో అలాంటి వాటికి ఛాన్సే ఉండదు. లక్కీగా అత్యున్నత స్థానాల్ని సొంతం చేసుకునే కొందరు నేతలు ఉంటారు. అయితే.. కాల ప్రవాహంలో వారు తమకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా? దుర్వినియోగం చేసుకుంటారా? అన్నది వారు వ్యవహరించే తీరు మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా ఎందుకంటే.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఈ మధ్యన మీడియా ఇస్తున్న ఎలివేషన్ చూస్తుంటే.. కొత్త సందేహాలు కలుగక మానదు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ ను ఎవరు అవునన్నా.. కాదన్నా పవన్ ఖాతాలోకే వేయాలి. అందులో ఎవరికి వాటా ఇవ్వటం న్యాయం కాదు. ధర్మం కూడా కాదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం వెనుక.. పవన్ కమిట్ మెంట్ ఎంతన్న విషయం అందరికి తెలిసిందే. అయినప్పటికీ.. అప్పట్లో ఆయనకు వంద శాతం స్టైక్ రేట్ ఘనత మీడియా కట్టబెట్టినా.. అదంతా మొక్కుబడిగా చేశారే తప్పించి మనస్ఫూర్తిగా చేసినట్లుగా కనిపించదు.
ఈ వాదనకు ఆధారం చూపాలని కొందరు ప్రశ్నించొచ్చు. చంద్రబాబును ఎత్తేసినంత భారీగా పవన్ కు ఎలివేషన్ ఇవ్వటం కనిపించదు. ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి.. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ.. నీతిగా ఉంటున్నా.. తన సొంత డబ్బులతో తన ఆఫీసు ఇంటీరియర్ ఏర్పాటు చేసుకున్నా.. ఆయన కమిట్ మెంట్ ను ప్రజలకు తెలిసేలా మీడియాలో స్టోరీలు రాలేదు. ఆయన నిర్వహిస్తున్న శాఖ మీద పట్టుకోసం రాత్రింబవళ్లు కష్టపడినా.. అందుకు తగ్గ ఇమేజ్ పరిమితంగానే వచ్చిందని చెప్పాలి.
ఇప్పటివరకు చెప్పిందంతా తెలుగు మీడియా గురించి. ఇప్పుడు జాతీయ మీడియా గురించి ప్రస్తావించాలి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. ఆ ఎన్నికల్లోనూ పవన్ కు వంద శాతం స్ట్రైకింగ్ రేటు కట్టబెడుతూ వార్తలు రావటం.. ఎన్ డీఏ కూటమిలో పవన్ ను ఒక పవర్ ఫుల్ నేతగా అభివర్ణించటం లాంటివి కనిపిస్తాయి. నిజానికి మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ఏం చేశారు? ఆయన ప్రచారం ఎలా సాగింది? అన్నది చూస్తే.. తెలుగు ప్రజలు.. తెలుగు మూలాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయటం.. ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు విజయం సాధించటంతో గెలుపు క్రెడిట్ మొత్తం పవన్ ఖాతాలో వేయటం కనిపిస్తుంది. అందులో నిజం ఎంత? అన్నది చూస్తే.. ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి.
జాతీయ మీడియా విషయానికి వస్తే మోడీ అండ్ కో విషయంలో మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించటం కనిపిస్తుంది. ఏదైనా రాష్ట్రంలో బీజేపీ ఘన విజయం సాధిస్తే.. దాన్ని తక్కువ చేసి చూపేందుకు అవసరమైన కారణాలు వెతకటం.. వాటికి ఎక్కువగా ఫోకస్ చేయటం కనిసిస్తుంది. మహారాష్ట్రలో బీజేపీ గాలి ఎంతన్న విషయం మొన్నటి ఫలితాలు స్పష్టంగా చెప్పేశాయి. అలాంటివేళలో.. ఎవరు ప్రచారం చేసినా గెలుపు నల్లేరు మీద నడకే. అలాంటిది పవన్ కు పెద్ద పీట వేయటం.. ఆయన కారణంగానే ఆయన ప్రచారం చేసిన స్థానాల్లో అభ్యర్థులు గెలిచారనటంలో అర్థం లేదు.
ఒక రాష్ట్రంలో సంబంధం లేని ఒక ప్రముఖుడి ఎన్నికల ప్రచారం కారణంగా ఎన్నికల్లో గెలిచినట్లుగా సమకాలీన కాలంలో ఎప్పుడైనా విన్నామా? అన్నది పాయింట్. అలాంటిది పవన్ కు భారీ ఎలివేషన్ ఇస్తూ నేషనల్ మీడియా అంతలా ఎందుకు ఇస్తున్నట్లు ప్రశ్న. ఇదంతా చూస్తే.. బీజేపీని తక్కువ చేయటానికే తప్పించి.. పవన్ ను వాడుకోవటమే కనిపిస్తుంది. ఒకవేళ.. పవన్ అంత పవర్ ఫుల్ అయితే.. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న షిప్ ను సీజ్ చేయాలన్న ఆదేశం అంశంపై ఆ శాఖకు చెందిన కేంద్ర మంత్రి అప్పటికప్పుడు స్పందించాలి కదా? కనీసం.. హోం శాఖ ఒక నోట్ విడుదల చేయాలి కదా? ఇప్పటివరకు అలాంటిదేమీ ఎందుకు జరగలేదు. అంతదాకా ఎందుకు.. అక్కడి సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా? అలాంటిదేమీ జరగలేదు కదా? అలాంటప్పుడు పవన్ కు జాతీయ మీడియా.. సోషల్ మీడియాలో కొందరు ఇస్తున్న ఎలివేషన్ చూస్తే.. లెక్క ఏదో తేడా అన్నట్లు అనిపించట్లేదు?