శ‌ర‌ద్ ప‌వార్‌కు మోడీ దువ్వుడు.. కాంగ్రెస్ వ‌ల్లే ఆయ‌న పీఎం కాలేదంట‌!

మ‌హారాష్ట్ర‌కు చెందిన ఎన్సీపీ అధినేత, మాజీ సీఎం శ‌ర‌ద్ ప‌వార్‌ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ దువ్వ డం ప్రారంభించారు.

Update: 2023-08-10 00:30 GMT

మ‌హారాష్ట్ర‌కు చెందిన నేష‌న‌లిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత, మాజీ సీఎం శ‌ర‌ద్ ప‌వార్‌ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ దువ్వ డం ప్రారంభించారు. విప‌క్ష కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మిలో ఎన్సీపీ కూడా భాగ‌స్వామ్య పార్టీగా ఉంది. అయితే.. మ‌హారాష్ట్రలో మారిన రాజ‌కీయాల నేప‌థ్యంలో ఎన్సీపీ చీలిపోయి ప‌వార్ త‌మ్ముడి కుమారుడు అజిత్ బీజేపీతో చేతులుక‌లిపారు. ఇక‌, ప‌వార్‌ను కూడా త‌మ‌వైపు తిప్పేసుకుంటే.. ఇండియా కూట‌మి బ‌ల‌హీనప‌డుతుంద‌నేది బీజేపీ వ్యూహంగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల పుణేలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ధానికి తిల‌క్ అవార్డు ఇచ్చిన‌ప్పుడు శ‌ర‌ద్ ప‌వార్‌ను ఆహ్వానించ‌డం.. ఆయ‌న వెళ్లి.. ప్ర‌ధాని ప‌క్క‌నే కూర్చోవ‌డం వంటివి సంచ‌ల‌నం క‌లిగించాయి.

ఇక‌, ఇప్పుడు నేరుగా మోడీ.. శ‌ర‌ద్ ప‌వార్‌ను దువ్వేయ‌డం ప్రారంభించాయి. ఆయ‌న‌కు ప్ర‌ధాని అయ్యే యోగం లేకుండా పోవ డానికి కాంగ్రెస్‌పార్టీనే కార‌ణ‌మ‌ని మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కుటుంబ, వార‌స‌త్వ‌, రాజ‌రిక రాజ‌కీయ కార‌ణాల‌తో అత్యంత సీనియ‌ర్ అయిన శ‌ర‌ద్ ప‌వార్‌కు ప్ర‌ధాని పీఠం ద‌క్క‌లేద‌ని మోడీ క‌న్నీరు పెట్టుకున్నంత ప‌ని చేశారు. తాజాగా, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల‌కు చెందిన ఎన్డీయే(మోడీ) కూటమి ఎంపీలతో ఆయ‌న భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా మ‌హా నేత శ‌ర‌ద్ ప‌వార్‌ను ఉద్దేశించి ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు.

`` ప్రతిపక్షంలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. కానీ, కాంగ్రెస్‌ వారసత్వ, కుటుంబ‌, రాచ‌రిక‌ రాజకీయాల కారణంగా వారిని ప్రోత్సహించలేదు. దీనివల్ల శరద్‌ పవార్‌, ప్రణబ్‌ ముఖర్జీ వంటి అత్యంత సమర్థులకు ప్రధాని అయ్యే అవకాశం లభించలేదు’’అని మోడీ అన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న మిత్రపక్షాలే తమకు ముఖ్యమని.. సమష్టిగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. అందువల్లే తమకు ఎంతో గౌరవం లభిస్తోందని ప్రధాని ఉద్ఘాటించారు.మాకు అహంకారం లేదు

కాంగ్రెస్ పార్టీ మాదిరిగా బీజేపీకి అహంకారం లేదని మోడీ చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారని.. కానీ, వారి కుటుంబ, బుజ్జగింపు, అవినీతి రాజకీయాలే దేశానికి ప్రమాదకరమని అన్నారు. దేశంలో వీటిని రూపుమాపాలని ప్రధాని సూచించారు. అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తాను ఎప్పుడూ భయపడలేదని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News