లైన్‌లోకి బీజేపీ.. కాకా పట్టేస్తున్నారు.. !
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ తాజాగా మరోసారి యాక్టివ్ అయింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ తాజాగా మరోసారి యాక్టివ్ అయింది. నిన్నటి వరకు మౌనంగా ఉన్న నాయకులు.. ఇప్పుడు లైన్‌లోకి వచ్చేశారు. సార్.. ఏం చేస్తున్నారు? అంటూ.. సీనియర్ నాయకులను లైన్‌లోకి తెచ్చుకుంటున్నారు.దీనికి కారణం.. తాజాగా ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడమే. ఇది బయటకు వచ్చిన తర్వాత.. బీజేపీ నేతల ఫోన్లు మోగుతున్నాయి.
మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సమయం కూడా చాలా చాలా తక్కువగా ఉంది. పైగా.. ఈలోగా.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం కూడా ఉంది. దీంతో మరింత తక్కువ సమయం లోనే నేతలను ఎంపిక చేయాల్సి ఉండడంతో నేతలు ఖంగారు పడుతున్నారు. పైగా.. కూటమి సర్కారు లోని మెజారిటీ స్థానాలు టీడీపీ చేతిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రకటించిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 3 స్థానాలను ఖచ్చితంగా ఆ పార్టీ తీసుకుంది.
ఇక, మిగిలిన రెండు స్థానాల్లో 1 జనసేన తీసుకోవడం ఖాయం. సో.. మిగిలిన 1 స్థానమైనా బీజేపీ దక్కే అవకాశం ఉంటుంది. కానీ, ఇద్దరు కీలక నాయకులు ఈ సారి మండలిలో అధ్యక్షా అనేందుకు రెడీ అయ్యారు. వీరిలో ఒకరు రాష్ట్రస్థాయిలో పార్టీని నడిపిన నాయకుడు కాగా.. మరొకరు ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎమ్మెల్సీ. ఈ ఇద్దరికీ ఆర్ ఎస్ ఎస్‌తోనూ బలమైన బంధం ఉంది. గతంలోనూ ఎమ్మెల్సీలుగా చేసిన అనుభవం కూడా ఉంది.
ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకులు కూడా.. బీజేపీ సీనియర్లు నుంచి ఎంపీల వరకు కాకా పడుతున్నట్టు తెలిసింది. అంతేకాదు.. మరొక నాయకుడికి జాతీయ పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యం లో అక్కడ నుంచి నరుక్కొస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సో.. దీనిని బట్టి.. ఆ ఇద్దరికి ఎవరికి టికెట్ దక్కుతుందో చూడాలి. మరోవైపు.. టీడీపీ నాయకులు 4 స్థానాలు తమవేనని.. ఒకటి మాత్రమే జనసేనకు ఇస్తున్నామని చెబుతున్నారు. దీంతో ఏం జరుగుతుందనేది చూడాలి.