నెల్లూరు చిక్కు ముళ్ళు... వైసీపీ వల్ల అవుతుందా ?
ఆయన 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో నెల్లూరు నుంచి మరోసారి పోటీ చేసి వైసీపీ గుర్తు మీద తొలిసారి విజయ భేరీ మోగించారు.
నెల్లూరు జిల్లా వైసీపీకి ఎంతో బాసటగా నిలిచిన జిల్లా. వైసీపీ ఏర్పాటు అయిన వెంటనే ఈ జిల్లా నుంచే ఆ పార్టీ జెండా ఎగిరింది. జగన్ తో పాటు ఆనాడు తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన రెండవ వారు సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆయన 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో నెల్లూరు నుంచి మరోసారి పోటీ చేసి వైసీపీ గుర్తు మీద తొలిసారి విజయ భేరీ మోగించారు.
ఆ తరువాత నెల్లూరు అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరిగితే వైసీపీ అన్ని సీట్లూ గెలుచుకుని స్వీప్ చేసింది. 2014లో నెల్లూరులో మూడు సీట్లు తప్ప అన్నీ గెలుచుకుంది. 2019లో పదికి పది సీట్లను గెలిచింది. ఇలా వైసీపీకి నెల్లూరు పెద్ద దిక్కుగా ఉంది. కొండంత అండగా నిలబడి రాజకీయాన్ని పీక్స్ కి చేర్చింది. అయితే అదే నెల్లూరు వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం వర్గ పోరుతో బలహీనపడుతూ వచ్చింది. అధినాయకత్వం సరైన సమయంలో పట్టించుకోకపోవడం వల్ల కూడా ఫ్యాన్ స్పీడ్ బాగా తగ్గింది.
ఇక 2024 చూస్తే మొత్తానికి మొత్తం పది సీట్లనూ ఒక ఎంపీ సీటునీ కూటమి కైవశం చేసుకుంది. ఆ విధంగా ఫ్యాన్ ని పొలిటికల్ గా స్విచాఫ్ చేసేంది. ఇక నెల్లూరు రాజకీయాల్లో మొదటి నుంచి వైసీపీలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి అలాగే 2019లో పార్టీలో చేరిన ఆనం రామ నారాయణరెడ్డి వంటి వారు పార్టీని వీడి పోవడం వల్ల కూడా తీవ్ర నష్టం రాజకీయంగా వైసీపీకి ఏర్పడింది.
అంతే కాదు మంత్రి పదవిని మూడేళ్ళ పాటు అనిల్ కుమార్ యాదవ్ కి ఇస్తే ఆయన ఒంటెత్తు పోకడలు పోవడంతో ఒక బలమైన సామాజిక వర్గం పార్టీకి దూరం అయింది. కాకాణి గోవర్ధనరెడ్డికి చివరి రెండేళ్ళు మంత్రి పదవి ఇచ్చినా ఫలితం లేకపోయింది.
ఇక సీనియర్ నేతగా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రి పదవి దక్కనందుకు కొంతకాలం అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఎన్నికల్లో ఆయనను వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి కోవూరులో ఓడించారు. దాంతో ఆయన కూడా రాజకీయంగా అంత చురుకుగా లేరు. ఈ సమయంలో నెల్లూరు జిల్లా వైసీపీ పరిస్థితి గురించి గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ఏంటి అని అధినేత వైఎస్ జగన్ కీలకమైన సమావేశాన్ని నిర్వహించడం ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు.
అయితే నెల్లూరు లో వైసీపీకి కంచుకోటలు ఎలా కూలిపోయాయి మొదటి నుంచి బలం తక్కువగా ఉన్న టీడీపీ ఎలా స్వీప్ చేసింది అన్నది లోతుగా వెళ్తేనే తప్ప అర్ధం కాదని అంటున్నారు. పార్టీలో ఉన్న నాయకులకు భరోసా కల్పించాల్సి ఉంది. అలాగే క్యాడర్ కి అండగా ఉండాల్సి ఉంది. అంతే కాదు రానున్న రోజులలో తిరిగి ఫ్యాన్ గిర్రున తిరిగేలా సంచలన నిర్ణయాలు అధినాయకత్వం తీసుకోవాల్సి ఉంది అని అంటున్నారు.
ముఖ్యంగా చూస్తే మేకపాటి గౌతంరెడ్డి మంత్రిగా ఉంటూ మరణించిన తరువాత నుంచి పార్టీకి సరైన అండ ఆధారం లేకుండా పోయింది అన్న మాట ఉంది. అలాంటి నాయకత్వాన్ని మళ్లీ వైసీపీ వెతికి ముందున పెట్టాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా నెల్లూరు వైసీపీ నిరాశ నీడలో ఉంది. దానిని తిరిగి ఆశల పల్లకీలోకి తేవడం అంటే అంత సులువేమీ కాదు నెల్లూరు వైసీపీలో ఎన్నో చిక్కు ముళ్ళు ఉన్నాయి వాటిని విప్పడం వైసీపీ వల్ల అవుతుందా అన్నదే చర్చగా ఉంది.