నేపాల్ లో ఒకే ఒక్క బిలియనీర్.. మనోడే
మన ఇరుగున ఉన్న బుల్లి దేశం నేపాల్. ఈ దేశంలో ఒకే ఒక్క బిలియనీర్ ఉన్నాడు. ఆయన పేరు బినోద్ కుమార్ చౌదరి.;

మన ఇరుగున ఉన్న బుల్లి దేశం నేపాల్. ఈ దేశంలో ఒకే ఒక్క బిలియనీర్ ఉన్నాడు. ఆయన పేరు బినోద్ కుమార్ చౌదరి. ఇందులో ప్రత్యేకత ఏమందంటారా? అక్కడికే వస్తున్నాం. నేపాల్ లో ఉన్న ఏకైక బిలియనీర్ భారత సంతతికి చెందిన వ్యక్తే కావటం విశేషం. అంతేకాదు.. ఆయన చేసే వ్యాపారం మరేంటో కాదు.. న్యూడిల్స్. న్యూడిల్స్ వ్యాపారంతో బిలియనీర్ అయ్యాడా? అంటే.. ఆయన బ్రాండ్ కు ఉన్న ఇమేజ్ అలాంటిది.
డిపార్ట్ మెంటల్ స్టోర్లలో కానీ.. ఇన్ స్టెంట్ ఫుడ్ సెక్షన్లలో ప్రముఖంగా కనిపించే వాయ్ వాయ్ నూడుల్స్ బ్రాండ్ ఎవరిదో కాదు.. ఈ పెద్దమనిషిదే. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ న్యూడుల్స్ కు ఆయనే అధిపతి. 70 ఏళ్ల వయసున్న ఆయన పుట్టింది నేపాల్ రాజధాని ఖాట్మండులోనే. మార్వాడీ కుటుంబంలో పుట్టిన ఆయన తాత భూరమల్ దాస్ చౌదరి భారత్ లోని రాజస్థాన్ నుంచి నేపాల్ కు వలస వెళ్లారు. తొలుత ఆయన వస్త్ర వ్యాపారం చేసేశారు. ఆయన కుమారుడు.. భూరమల్ దాస్ తండ్రి ఆ దేశంలో మొట్టమొదటి డిపార్ట్ మెంటల్ స్టోర్ ను ఏర్పాటు చేశారు. ఆయనకు సారికతో వివాహమైంది. వారికి ముగ్గురు సంతానం. వారందరికి వ్యాపారాలు ఉన్నాయి.
బినోద్ కుమార్ చౌదరి విషయానికి వస్తే.. పలు దేశాల్లో 160కి పైగా కంపెనీలు ఉన్న గ్రూపు (సీజీ కార్ప్ గ్లోబల్) ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ పేరు మీద 120కు పైనే బ్రాండ్లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 15 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ గ్రూప్ కు చెందిందే వాయ్ వాయ్ బ్రాండ్ న్యూడిల్స్. నేపాల్.. భారత్ తో పాటు పలు దేశాల్లో ఈ నూడిల్స్ కు మంచి గిరాకీ ఉంది. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని చెప్పాలి. పలు దేశాల్లో ఫేమస్ బ్రాండ్ న్యూడిల్స్ ను ఉత్పత్తి చేసే ఆయన కఠిన శాఖాహారి. కానీ.. ఆయన చికెన్ నూడిల్స్ మాత్రం చాలా ఫేమస్.
నూడిల్స్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్.. విద్య.. ఎలక్ట్రానిక్స్.. ఎనర్జీ.. టెలికాం.. బయోటెక్నాలజీ రంగాల్లో వ్యాపారాలు ఉన్నాయి. అటు వ్యాపారాలతో పాటు ఇటు నేపాలీ కాంగ్రెస్ పార్టీ తరఫు ఎంపీగా వ్యవహరిస్తున్నారు. సంపాదించిన సొమ్మును దానాలు చేయటం కూడా ఆయనకు అలవాటు. 2015లో నేపాల్ ను దారుణంగా దెబ్బ తీసిన భూకంపం నేపథ్యంలో 10వేల ఇళ్లు.. 100 స్కూళ్లను పునర్ నిర్మించేందుకు భారీగా విరాళం ఇచ్చారు. నేపాల్ ఏకైక బిలియనీర్ గా బినోద్ కుమార్ ను చెబుతారు. ఆయన నెట్ వర్త్ రూ.17200 కోట్లుగా చెబుతారు.