సౌండ్ తాడేపల్లిని దాటడం లేదా ?
ఎందుకంటే జగన్ ఉండాల్సింది అసెంబ్లీ లోపలా అని అంటున్నారు. అలాగే జగన్ మాట్లాడాల్సింది ప్రతిపక్ష నేతగా చట్ట సభలలో అని సగటు పౌరుడు అభిప్రాయ పడుతున్నారు.
ఏపీలో అంతా ఒక వైపు తాను ఒక వైపు. ఇదీ వైసీపీ పరిస్థితి. నిజంగా చూస్తే ఇది ఒక అద్భుతమైన అవకాశం. మొత్తం పార్టీలు కూటమి కట్టి ఎలా అధికారంలోకి వచ్చాయో అలాగే ప్రజా వ్యతిరేకతను కూడా మొత్తం పంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ మూడూ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కనుక.
ఇక పోతే వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఈ కూటమి ఒక్క వ్యతిరేక ఓటూ పొల్లుపోకుండా ఎలా తీసుకుందో అలాగే ప్రజా వ్యతిరేకతను కూడా పొల్లు పోకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అది విపక్షంలో ఉన్న వైసీపీకి భారీ అడ్వాంటేజ్ గా మారబోతోంది. వైసీపీకి కలసి వస్తున్న అదృష్టం ఏంటి అంటే ఏకైక ప్రతిపక్షంగా ఉండడం.
ఏపీలో పేరుకు కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉన్నా వాటి ఓటు శాతం మొత్తంగా రెండు శాతం మించదు రానున్న నాలుగేళ్లలో అవి ఎంత పెంచుకున్నా మహా అయితే మరో ఒకటో అరో పెరుగుతుంది తప్ప అంతకు మించి జరగదు. ఈ నేపథ్యంలో కూటమి మీద జనాలకు మొహం మొత్తితే వైసీపీ వైపు చూస్తారు.
మరి ఇంతటి పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటే వైసీపీ అధినాయకత్వం ఏమి చేస్తోంది అనేది ఇక్కడ చర్చ. పాలు తాగలేక పిల్లి ముంతను ఒలకబోసుకుందన్న చందాన వైసీపీ తాను ఒక సిసలైన ప్రతిపక్షంగా ప్రజావాణిని చట్ట సభలలో వినిపించలేకపోతోంది. వైసీపీలో ఎందరు ఉన్నా జనాలకు పట్టింపు ఉండదు,
జగన్ వాయిస్ మాత్రమే వారికి కావాలి. అదే రీచ్ అవుతుంది. శాసనమండలిలో సీనియర్ నేతలు కొందరు మాట్లాడుతున్నా జనాలకు ఎక్కడం లేదు, అదే అసెంబ్లీలో జగన్ నిలబడి మాట్లాడితే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. తమకు ఎంత మంది మెంబర్స్ ఉన్నారని కాదు, తాను ఎంత ధాటీగా మాట్లాడాను అన్నదే ప్రధానం.
ఈ విషయం జగన్ కి అర్ధం కావడం లేదా అని అంతా అంటున్నారు. టీడీపీ కూటమి చేసిన పొరపాట్లను బడ్జెట్ లో లోటు పాట్లను జగన్ మీడియా ముఖంగా అద్భుతంగా వివరిస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ అది జనాలకు రీచ్ కావడం లేదు అని అంటున్నారు.
ఎందుకంటే జగన్ ఉండాల్సింది అసెంబ్లీ లోపలా అని అంటున్నారు. అలాగే జగన్ మాట్లాడాల్సింది ప్రతిపక్ష నేతగా చట్ట సభలలో అని సగటు పౌరుడు అభిప్రాయ పడుతున్నారు. జగన్ తన తాడేపల్లి ఆఫీసులో కూర్చుని ఎంత గణాంకాలు వల్లించినా ఎంత బిగ్ సౌండ్ చేసినా అది తాడేపల్లి గేట్ దాటి పోవడం లేదు అని అంటున్నారు.
ఇదే సూపర్ సిక్స్ హామీల మీద జగన్ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వాన్ని నిగ్గదీస్తే వచ్చే పొలిటికల్ మైలేజ్ ఒక్క లెక్కన ఉండేదని అంటున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఆలోచనలు రోడ్లకు టోల్ టాక్స్ వేయాలను చూడడం విద్యుత్ బిల్లులకు ట్రూ అప్ చార్జీలు వీటి మీద ఆయన మాట్లాడి ఉంటే సామాన్యుడు మెప్పు పొందే వారు అని అంటున్నారు.
బంగారం లాంటి అసెంబ్లీని కాదనుకు జగన్ చేస్తున్న ఈ మీడియా విన్యాసం మాత్రం జనం మెచ్చేలా లేదని అంటున్నారు. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి గట్టిగా ఆరు నెలలు కాలేదు. అపుడే సభ మీద అలిగి ఇంట్లో కూర్చుంటే వైసీపీ మీదనే వ్యతిరేకత పెరుగుతుందని అంటున్నారు. జనాల మీదనే జగన్ కి కోపమని అనుకునే ప్రమాదమూ ఉంది.
ఒకవేళ అలా అనుకున్నా జనాల కోపం ఎపుడూ స్థిరంగా ఉండదు, కాదు అన్న వారే అవును అంటారు. 2014లో వైసీపీని పక్కన పెట్టిన జనాలే 2019లో అందలం ఎక్కించారు అన్నది గుర్తు చేసుకోవాలి. ఆనాడు వైసీపీ కూడా సభకు వెళ్ళి అధికార టీడీపీని నిలదీసింది. ఇపుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఇంట్లో కూర్చుంటే అధికార పక్షం కంటే వైసీపీ మీదనే నెగిటివిటీ ఎక్కువగా వచ్చే చాన్స్ ఉంది.
ఈ నెల 22తో బడ్జెట్ సెషన్ ముగుస్తోంది. కాబట్టి 2025 మార్చి వరకూ వైసీపీకి అసెంబ్లీకి వెళ్ళే చాన్స్ అయితే రాకపోవచ్చు. కానీ కొత్త ఏడాది బడ్జెట్ సెషన్ కి అయినా జగన్ అండ్ కో మనసు మార్చుకుని వస్తేనే వైసీపీ వాయిస్ జనంలోకి పోతుందని అపుడే పొలిటికల్ గా ఆ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. మరి వైసీపీ ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.