మందుబాబులకు షాక్..10 రోజులు షాపులు బంద్

కాగా, రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 12వ తేదీ నుంచి నూతన మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి.

Update: 2024-10-02 04:44 GMT

వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యపాన నిషేధం అంటూ భారీ ధరలకు నాసిరకం మద్యం సరఫరా చేసిన వైనంపై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే గత ప్రభుత్వం తెచ్చిన మద్యం పాలసీని ఏపీలో ఇటీవల కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్ రద్దు చేసింది. ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. మరోవైపు, సెప్టెంబర్ 30వ తేదీతో ఏపీలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న సేల్స్ మెన్, సూపర్ వైజర్ల కాంట్రాక్టు ముగిసింది. దీంతో, ఈ రోజు నుంచి విధుల్లోకి రావడం లేదని వారు ప్రకటించడంతో ఏపీలో మద్యం షాపులు మూతబడ్డాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా మందుబాబులకు షాక్ తగిలినట్లయింది.

అక్టోబర్ 10 వరకు మద్యం దుకాణాలు తెరవాలని కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం కోరినా ఫలితం లేకపోయింది. ప్రైవేట్ వైన్ షాపులు వస్తున్న నేపథ్యంలో తాము ప్రత్యామ్నాయ ఉద్యోగాలు చేసుకోవాలని, 1వ తేదీ నుంచి విధుల్లోకి రాలేమని వారు స్పష్టం చేశారని తెలుస్తోంది. దీంతో, ప్రస్తుతం ఏపీలో ఉన్న 3,240 ప్రభుత్వ వైన్ షాపులు బంద్ అయ్యాయి. ఈ క్రమంలోనే చాలామంది మందుబాబులు బార్ ల ముందు బారులు తీరారు. ఇక, బార్ లలో బారుగా ఉండే బిల్లులను భరించలేని వారు చుక్క లేక...కక్కలేక....మింగలేక ఉన్నారు.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 12వ తేదీ నుంచి నూతన మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. అక్టోబరు 1వ తేదీ ఉదయం 11 గంటల నుంచి కొత్త వైన్ షాపుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 11న మొత్తం 3,396 వైన్ షాపులకు లాటరీ తీస్తారు. ఒక్కో టెండర్ దరఖాస్తు రుసుము రూ. 2 లక్షలు. టెండర్ దక్కినా...దక్కకున్నా...ఆ రెండు లక్షలు తిరిగి చెల్లించరు. లాటరీ విధానం ద్వారా వైన్ షాపులు దక్కించుకున్న వారు లైసెన్స్ ఫీజుల కింద రూ. 50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు చెల్లించాలి. రెండేళ్ల కాలపరిమితితో ప్రైవేటు వైన్ షాపులను ప్రభుత్వం మంజూరు చేస్తోంది.

Tags:    

Similar News