పదేళ్ల మోడీ జమానాలో జరుగుతున్నదేంటి?
గడిచిన పదేళ్లలో అయితే.. ఈ తీరులో మరింత తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
ఏడాదికి మూడుసార్లు నిర్వహించే పార్లమెంటు సమావేశాలకు సంబంధించి.. అంతకంతకూ తగ్గుతున్నచర్చల సారం ఆందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్లమెంట్ కు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. గడిచిన రెండు దశాబ్దాలుగా ఆ తీరులో మార్పు వచ్చింది. గడిచిన పదేళ్లలో అయితే.. ఈ తీరులో మరింత తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. దీంతో.. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అరుపులు.. కేకలు.. దూషణలు.. తోపులాటలే తప్పించి.. లోతైన చర్చలు.. చట్టాలుగా చేసే అంశాలపై వాదనలు లాంటివి అంతకంతకూ తగ్గుతున్న దుస్థితి.
ఇందుకు 18వ లోక్ సభ శీతాకాల సమావేశాలే నిదర్శనంగా చెప్పాలి. పార్లమెంట్ సమావేశాల్లో అత్యంత కీలకమైనది ప్రశ్నోత్తరాల సమయం. ఇది నానాటికి తగ్గిపోతోంది. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. పార్లమెంట్ బిజినెస్ లో ఇతర అంశాల కోసం అదనపు గంటలు పని చేసే వెసులుబాటు ఉంటుంది కానీ ప్రశ్నోత్తరాలు వాయిదా పడితే ఆ టైంను పొడిగించరు. అందుకే.. ప్రశ్నోత్తరాల సమయాన్ని సభ్యులు నూటికి నూరు శాతం వినియోగించాల్సిన అవసరం ఉంది.
బ్యాడ్ లక్ ఏమంటే.. ప్రశ్నోత్తరాల టైం తగ్గిపోతోంది. 16వ లోక్ సభలో ప్రశ్నోత్తరాల కోసం నిర్దేశించిన వ్యవధిలో కేవలం 77 శాతం.. అదే విధంగా రాజ్యసభలో 44 శాతమే వినియోగించటం చూస్తే.. విలువైన సమయం ఎలా వ్రధా అవుతుందన్న విషయం అర్థమవుతుంది. ప్రశ్నోత్తరాల టైంను కొత్తగా ఎన్నికైన సభ్యులు ఎక్కువగా వినియోగించుకుంటారు. ఇంత పెద్ద దేశంలో తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలకు సంబందించిన ప్రశ్నలు వేసి వాటికి జవాబులు ఆశిస్తారు. ప్రశ్నోత్తరాల టైం రద్దు అయితే.. సభ్యులు తమకు ఉన్న విలువైన అవకాశాన్ని కోల్పోతారన్నది వాస్తవం.
మన పార్లమెంట్ వ్యవస్థలో.. నానాటికి చర్చలుజరిగే తీరు తగ్గుతుంది. దీన్ని అధికార పక్షం వారు ఒకలా.. విపక్షాలు మరోలా వ్యవహరిస్తున్నాయి. మొత్తంగా సభను సజావుగా జరిపే కన్నా.. తమ రాజకీయ బలాన్నిప్రదర్శించే వేదికలుగా పార్లమెంట్ ను మార్చేసుకోవటం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ ధోరణి మోడీ అధికారంలో ఉన్న పదేళ్లలో మరింత ఎక్కువైందన్న విమర్శ ఉంది.
తాజాగా ముగిసిన శీతాకాల సమావేశాల్నే తీసుకుంటే.. రాజ్యసభ ఛైర్మన్.. ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్కడ్ పై విపక్షం అవిశ్వాస తీరమానం ప్రవేశ పెట్టటానికి ఇచ్చిన నోటీసును డిప్యూటీ ఛైర్మన్ తిరస్కరించటంతోగందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో రాజ్యసభ వాయిదా పడింది. కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ను అవమానించారంటూ విపక్ష సభ్యులు గందరగోళాన్ని క్రియేట్ చేయటమే కాదు.. చివరకు అధికార.. విపక్షాల మధ్య తోపులాటలు.. ముష్టిఘాతాల వరకు వెళ్లటం చూస్తే.. పార్లమెంట్ సభలు ప్రజల సమస్యల మీద చర్చ జరగటానికా? అధికార.. విపక్షాల బలాన్ని ప్రదర్శించేందుకా అన్నది ప్రశ్నగా మారింది.
సభను సజావుగా జరిపేందుకు అధికారపక్షం కాస్త తగ్గటం.. అదే సమయంలో విపక్షాలు హుందాగా వ్యవహరించటం తగ్గిపోయింది. దీంతో.. సభా సమయంలో అనూహ్య పరిణామాలకు వేదికగా మారుతోంది. నిజానికి శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు భారీ ఎజెండానే సిద్దం చేశారు. మొత్తం 16 బిల్లులు ప్రవేశ పెట్టి.. మెజార్టీ బిల్లుల్ని ఆమోదించాలని భావించారు. కానీ.. విమానయాన రంగానికి సంబంధించిన భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 బిల్లు ఒక్కటి మాత్రమే ఉభయ సభల ఆమోదం పొందింది.
దేశ ఎన్నికల స్వరూపాన్ని మార్చేసే జమిలి ఎన్నికలకు సంబంధించి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టి దాన్ని జేపీసీకి పంపారు. దేశ ప్రయోజనాలకు అవసరమైన అంశాల విషయంలో సభ ఏకాభిప్రాయానికి రావాల్సి ఉండగా.. కీలక అంశాలపైకూడా అధికార.. విపక్షాలు ఒక తాటి మీదకు రాలేని పరిస్థితి. ఈ విషయంలో అందరికి పెద్దన్నలా వ్యవహరించాల్సిన మోడీ.. ఆ పాత్రను పోషించే విషయంలో అడ్డంగా ఫెయిల్ అయ్యారన్న విమర్శ వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. ఈ తీరు మారాలి. అందుకు ప్రభుత్వమే నడుం బిగించాలి. అందరిని కలుపుకుపోయేలా సంకేతాలు ఇవ్వటం.. పార్లమెంట్ లో సజావుగా చర్చలుజరగటానికి అవసరమైన కసరత్తు తెర వెనుక కూడా సమర్థంగా సాగాలి. లేదంటే.. విలువైన ప్రజాధనం వేస్టు కావటమే కాదు.. చర్చలు జరగకుండానే బిల్లులు కాస్తా చట్టాలుగా మారితే అది దేశ ప్రజలకే నష్టం కలిగిస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.