కొత్త స్కాం: డేటింగ్ కు వెళ్లాడు.. దెబ్బ పడిపోయింది
రోజుకో మోసం అన్నట్లుగా మారింది పరిస్థితి.
రోజుకో మోసం అన్నట్లుగా మారింది పరిస్థితి. మొన్నటి వరకు గుట్టు చప్పుడు కాకుండా ఆన్ లైన్ లో మాట కలపటం.. వలపు వల విసరటం.. ఆ వెంటనే అడ్డంగా బుక్ చేయటం.. డబ్బులు కొట్టేయటం లాంటివి జరిగిపోయేవి. రోజులు గడిచేకొద్దీ సైబర్ నేరగాళ్ల బరితెగింపు మరింత ఎక్కువ అవుతోంది. ఆన్ లైన్ లో దెబ్బేసే కార్యక్రమాన్ని ఆఫ్ లైన్ లోనూ సరికొత్త ఎత్తులు వేస్తూ దోచేస్తున్నారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ఆన్ లైన్ లో పరిచయమైన అమ్మాయిని ఆఫ్ లైన్ లో డేట్ కోసం వెళితే తానెంతగా దెబ్బ పడిపోయానన్న విషయాన్ని ఒక బాధితుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన సదరు వ్యక్తి అనుభవాన్ని చూస్తే..
దేశ రాజధాని ఢిల్లీకి చెందిన అర్చిత్ గుప్తా అనే వ్యక్తికి ‘‘జంబుల్’’ డేటింగ్ యాప్ ద్వారా ఒక అమ్మాయి పరిచయమైంది. ఆన్ లైన్ లో వారి మధ్య మాటలు కలిసి.. ఆఫ్ లైన్ లో డేట్ కు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం రాజౌరీ గార్డెన్ లోని బార్ కు వెళ్లారు. తామిద్దరం బార్ కు వెళ్లిన తర్వాత.. రెండు-మూడు గ్లాసుల డ్రింక్స్.. చికెన్ టిక్కా, వాటర్ బాటిల్ తీసుకున్నామని.. బిల్లు వచ్చాక చూస్తే దిమ్మ తిరిగిపోయిందని పేర్కొన్నాడు. దీనికి కారణం బిల్లు రూ.15,886 కావటమేనని.. చేసేదేమీ లేక బిల్ పే చేసి బాత్రూంకు వెళ్లానని చెప్పాడు.
బాత్రూం నుంచి తిరిగి వచ్చేసరికి అమ్మాయి లేదని.. ఫోన్ చేస్తుంటే కాల్ లిఫ్టు చేయలేదని.. డౌట్ వచ్చి యాప్ లోకి వెళితే.. అకౌంట్ డిలీట్ చేసి ఉన్నట్లు పేర్కొన్నాడు. తాను మోసపోయిన విషయం అర్తమైందని పేర్కొన్నాడు. ఇలా ఆన్ లైన్ పరిచయాన్ని ఆఫ్ లైన్ లోకి తీసుకెళ్లి.. మోసానికి పాల్పడటం ఈ మధ్యన ఎక్కువైంది. డేటింగ్ యాప్ మాటున అబ్బాయిల్ని దెబ్బేసే కిలేడీలు ఈ మధ్యన ఎక్కువ అయ్యారు. బీకేర్ ఫుల్ బ్రదర్.