ఏపీలో కొత్త మద్యం పాలసీ పర్మిట్ రూమ్స్ పై కీలక నిర్ణయం!!

నాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు మొదలుపెట్టింది.

Update: 2024-08-08 06:46 GMT

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలు హరించే కల్తీ మద్యం బ్రాండ్ల నుంచి విముక్తి కలిగించి.. నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు మొదలుపెట్టింది. ఏపీలో "కొత్త" మద్యం పాలసీని తీసుకురానుంది.

అవును... గత ప్రభుత్వ హయాంలో గతంలో ఎన్నడూ కననీ, విననీ బ్రాండ్స్ మద్యం ఏపీ లిక్కర్ షాపుల్లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ మద్యం బ్రాండ్స్ పేర్లపై వైసీపీని బాగా ట్రోల్స్ చేసేవారు కూడా. ప్రధానంగా... బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, పవర్ స్టార్, రాయల్ 'ప్యాలెస్' మొదలైన మద్యం బ్రాండ్స్ పై ట్రోలింగ్ జరిగిందే. అయితే కూటమి సర్కార్ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి ఏపీలో నూతన మద్యం పాలసీని తీసుకురానున్నారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర ఈ విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా... గతంలో ఉన్న నాణ్యమైన మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. దీంతో... కచ్చితంగా ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని మద్యపాన ప్రియులు భావిస్తున్నారు.

ఇదే సమయంలో... ఈ కొత్త విధానం ప్రకారం ప్రస్తుతం ఉన్న అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలనూ మూసివేసి ప్రైవేటు వ్యాపారాలకు అప్పగించనున్నారని అంటున్నారు. అదేవిధంగా... ప్రస్తుతం బార్లు మాత్రమే ప్రైవేటు వెండర్ల కింద ఉన్న నేపథ్యంలో.. వీటి లైసెన్సులను డిసెంబర్ వరకూ పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే క్రమంలో.. పర్మిట్ రూమ్ విధానం కూడా గ్రామస్థాయిల్లోనూ అందుబాటులోకి రానుందని అంటున్నారు.

ప్రధానంగా పర్మిట్ రూమ్స్ లేకపోవడం వల్ల బహిరంగ ప్రదేశాలో మద్యం సేవించడం ఇబ్బందిగా ఉండేదని మద్యపాన ప్రియులు వాపోయేవారు. దీనివల్ల గ్రామాల్లో తోటల్లోకి, చెట్ల కిందకు వెళ్లి మద్యం సేవించేవారు. అయితే ఇకపై ఆ ఇబ్బంది లేకుండా పర్మిట్ రూమ్ లకు ఈ సర్కార్ విరివిగా అనుమతి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదే సమయంలో ఉదయం 11 గంటల వరకూ వైన్ షాప్స్ ఓపెన్ చేయకపోవడం వల్ల బ్లాక్ మార్కెట్ ఎక్కువగా నడిచేదని.. అందువల్ల టైమింగ్స్ కూడా మార్చే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. ఇదే క్రమంలో... చీప్ లిక్కర్ ను పూర్తిగా ఎత్తేసి, కాస్త బ్రాండెడ్ మద్యాన్నే తక్కువ ధరకు అందించే అవకాశం ఉందని చెబుతున్నారు.

గత ప్రభుత్వం రూ.60 ఉన్న మద్యాన్ని 150 నుంచి 200 రూపాయలకు విక్రయించిందనే విమర్శలు ఉన్న నేపథ్యంలో.. చంద్రబాబు సర్కార్ మాత్రం గతంలో ఆయన హయాంలో ఉన్న ధరల్లోనే ఏపీలో నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలా సరికొత్త మార్పులతో... నూతన మద్యం పాలసీ అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది!

Tags:    

Similar News