వచ్చేది వేసవి, పైగా ఉచిత కరెంట్... తెరపైకి కొత్త సమస్య!
అవును... కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలలో ఒకటైన ఉచిత విద్యుత్ పథకం తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిలో "గ్యారెంటీలు" బాగా కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. ఐదు గ్యారెంటీలు అని కర్ణాటకలోనూ.. ఆరు గ్యారెంటీలు అని తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన అనంతరం వాటి అమలుపై దృష్టి సారించింది. ఈ క్రమంలో తాజాగా వాటిలో మరో రెండు పథకాలను అమలు చేసింది. ఇందులో భాగంగా... రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకాలు ప్రారంభమయ్యాయి. ఈ విషయంలో ఉచిత విద్యుత్ పథకం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
అవును... కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలలో ఒకటైన ఉచిత విద్యుత్ పథకం తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఉచిత విద్యుత్ అందించే "గృహజ్యోతి" పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులను జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద ఒక ఇంటి కనెక్షన్ కు గరిష్టంగా 200 యూనిట్ల వరకూ విద్యుత్ ను ఉచితంగా అందించనున్నారు.
ఈ మేరకు అర్హుల ఎంపికకు సంబంధించి తెలంగాణ సర్కార్ మార్గదర్సకాలను విడుదల చేసింది. ఈ పథకం అర్హతకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారని తెలిపింది! ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఈ పథకాన్ని వర్తింపచేయాలంటూ ధరఖాస్తులు ఇచ్చిన వారిలో రేషన్ కార్డు, కరెంట్ కనెక్షన్ నెంబర్లను తెలిపినవారే అర్హులుగా ఎంపిక అవుతారు.
ఈ సమయంలో 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందించే ఈ గృహజ్యోతి పథకం వల్ల రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ ఉచిత విద్యుత్ పథకం లేనందు వల్ల 100 యూనిట్ల వరకే వినియోగం చేస్తునవారు.. ఎలాగూ ఉచితం కదా అని 200 యూనిట్ల వరకూ వాడుకోవచ్చనుకునే అవకాశాలు ఉండటమే దీనికి కారణం అని అంటున్నారు.
దీంతో వినియోగం బాగా పెరిగే అవకాశం ఉండటం వల్ల విద్య్తు సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. పైగా వచ్చేది వేసవి కావడంతో... ఈ వినియోగం కచ్చితంగా పెరుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్ ఫార్మర్ ల సంఖ్యను పెంచాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఇదే సమయంలో... ఉచితం అనే విషయాన్ని పక్కన పెట్టి.. వినియోగదారులు కాస్త జాగ్రత్తగానే కరెంట్ వాడాలని.. ఏమాత్రం వృథా చేయకూడదని సూచిస్తున్నారు.
కాగా... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం వచ్చిన తర్వాత ఎదుదైన సమస్యల సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పుడు టీఎస్ ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేటు 100శాతానికి చేరిందనే కథనాలు తెరపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో ఉచిత విద్యుత్ పథకం విషయంలోనూ అటువంటి సమస్య వచ్చే అవకాశం ఉందంటూ.. అందుకు పరిష్కారాల దిశగా అధికారులు చర్యలు చేపట్టబోతున్నారని తెలుస్తుంది!