హోటల్ బిల్ ఎగ్గొట్టడంలో కొత్త టెక్నిక్... తెలిస్తే స్ట్రోకే!

అవును... స్పెయిన్‌ లోని బ్లాంకా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి టాప్ రెస్టారెంట్లలో భోజనం చేసి, తన బిల్లును చెల్లించకుండా ఉండటానికి గుండెపోటు వచ్చినట్లు నటింస్తుంటాడు.

Update: 2023-10-19 13:49 GMT

హోటల్స్ లో ఫుల్ గా తినేసి బిల్ ఎగ్గొట్టాలని చాలా మంది చూస్తుంటారని వింటుంటాం. యజమాని చూడకుండా ఉంటే మెల్లగా జారుకోవాలని ఆలోచిస్తుంటారని అంటుంటారు. అయితే ఒక వ్యక్తి మాత్రం హోటల్ లో బిల్లు ఎగ్గొట్టడాన్ని ఒక హాబీగా ఎంచుకున్నట్లున్నాడు! ఇప్పటివరకూ సుమారు 20 రెస్టారెంట్లలో బిల్ ఎగ్గొట్టాడు. అందుకు అతడు ఎంచుకున్న మార్గం... హార్ట్ అటాక్!

అవును... స్పెయిన్‌ లోని బ్లాంకా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి టాప్ రెస్టారెంట్లలో భోజనం చేసి, తన బిల్లును చెల్లించకుండా ఉండటానికి గుండెపోటు వచ్చినట్లు నటింస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో.. పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక మీడియా నివేదిక ప్రకారం.. 50 ఏళ్ల వ్యక్తి 20 రెస్టారెంట్లకు పైగా రెస్టారెంట్లలో ఫుల్ గా తినేసి బిల్లు ఎగ్గొట్టాడట. సిబ్బంది బిల్ ఇవ్వగనే... ఎడమవైపున చెయ్యి పెడతాడు. డబ్బుల కోసం షర్ట్ పాకెట్ లో అనుకునేరు... గుండెపట్టుకుని నెప్పొచ్చినట్లు పడిపోతాడు.

గత నెలలో ఒక హోటల్‌ లోని రెస్టారెంట్‌ లో $37 (సుమారు రూ. 3,081) బిల్లు చేసినప్పుడు ఈ మోసం బట్టబయలైందట. బిల్ ఇచ్చి సిబ్బంది వెళ్లిపోవడంతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆయనను అడ్డుకుని బిల్లు గురించి గుర్తు చేశారు. దీంతో ఆ వ్యక్తి తన హోటల్ గదిలో డబ్బులు మరిచిపోయాయని.. అవి తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పుకొచ్చాడు.

దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది అతన్ని వదిలిపెట్టలేదు. ఆ సమయంలో, అతను నేలపై పడుకుని, మూర్ఛపోయినట్లు నటించడం ద్వారా గుండెపోటు అనే ఫెర్మార్మెన్స్ ప్రారంభించాడు. అయితే... ఇది చాలా నాటకీయంగా ఉందని, అతను నటిస్తున్నట్లు తాను గుర్తించానని ఆ రెస్టారెంట్ మేనేజర్ స్పానిష్ వార్తా సంస్థతో చెప్పారు.

ఇతని పై అనుమానం రాగానే రెస్టారెంట్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు రెస్టారెంట్ వద్దకు వచ్చారు. దీంతో అక్కడనుంచి పారిపోవాలని ప్రయత్నించిన ఆ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి నవంబర్ 2022 నుండి ఆ నగరంలో నివసిస్తున్నాడట. ప్రస్తుతం ఆ వ్యక్తి ఫోటో ఈ ప్రాంతంలోని రెస్టారెంట్లలో తిరుగుతోందట.

Tags:    

Similar News