తిరుపతి ఎంపీపై దాడి : మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం
ఈ సంఘటనపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు డీజీపీని ఆదేశించింది.
తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మేయర్ డాక్టర్ శిరీషపై జరిగిన దాడి విషయంలో తిరుపతి పోలీసులు అనుసరించిన విధానంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా రౌడీ మూకలు తమపై దాడి చేశాయని, నిందితుల పేర్లతో సహా తాము ఫిర్యాదు చేస్తే గుర్తు తెలియని వ్యక్తులు అంటూ పోలీసులు కేసు నమోదు చేయడంపై ఎంపీ గురుమూర్తి ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దాడి ఘటనపై వీడియో సాక్ష్యాధారాలు ఉన్నాయని, అయినప్పటికీ పోలీసులు నిందితులను రక్షించేలా వ్యవహరిస్తున్నారని ఎంపీ ఫిర్యాదుతో కమిషన్ సీరియస్ అయింది. ఈ సంఘటనపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు డీజీపీని ఆదేశించింది.
అత్యున్నత చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తనతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు ఓటింగుకు వెళుతుండగా, అధికార పార్టీకి చెందిన కొందరు దాడి చేశారని, తమను గాయపరిచారని ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. తమ హక్కులకు భంగం కలిగించారంటూ హక్కుల కమిషన్ ను ఆయన సంప్రదించారు. దాడి సమయంలో టీవీ చానళ్లలో ప్రసారమైన వీడియోలను సమర్పించారు. అంతేకాకుండా ఈ దాడికి తిరుపతి పోలీసు కమిషనర్, ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. వైసీపీ నేత భూమన అభియన్ రెడ్డి రాజీనామాతో ఈ పోస్టు ఖాళీ అయింది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషనులో మెజార్టీ కార్పొరేటర్లను గెలుచుకున్న వైసీపీ.. మేయర్ తోపాటు రెండు డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ కార్పొరేటర్లు జంపింగులతో బలాబలాల్లో మార్పు వచ్చింది. అయితే తమ పార్టీ నుంచి గెలిచి టీడీపీకి మద్దతు చెప్పడంపై వైసీపీ నేతలు కొందరు కార్పొరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీకి బలం లేకపోయినా తమ కార్పొరేటర్లను సభకు హాజరుకాకుండా చేసి డిప్యూటీ మేయర్ పదవిని గెలుచుకోవాలని చూస్తోందని అప్పట్లో ఆరోపించారు. ఇక అధికార పక్షం కూడా ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రెండు పార్టీలు తగ్గేదేలే అన్నట్లు దూకుడు చూపడం వివాదానికి దారితీసింది. అయితే అధికార పార్టీ నేతలు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించడం చర్చనీయాంశమవుతోంది. ఈ విషయంలో ఎన్ హెచ్ఆర్సీ జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఇప్పుడెలా స్పందిస్తారనేది ఆసక్తి రేపుతోంది.