నిమ్మ‌ల గారూ.. నిజాలు తెలుసుకోండి ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ అవే లెక్క‌ల దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

Update: 2024-09-16 03:50 GMT

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ అవే లెక్క‌ల దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఆశ్చ‌ర్యంగా ఉందా.. అయినా నిజ‌మే. 2014 -19 మ‌ధ్య కాలంలో చంద్ర‌బాబు ఏ లెక్క‌లు వేసుకున్నారో.. ఏ లెక్క‌ల ప్ర‌కారం పాల‌న సాగించారో.. ఇప్పుడు కూడా అదే బాట ప‌డుతున్నారు. అవే లెక్క‌లు వేసుకుంటున్నారు. అదే త‌ర‌హాలో పాల‌న చేస్తున్నార‌ని అనిపిస్తోంది. ఎం దుకంటే.. అప్ప‌ట్లో.. లెక్క‌లు వేసుకుని పాల‌న సాగించారు. చంద్ర‌బాబు ఏంచేసినా.. త‌దుప‌రి వారానికి ``స్థాయి`` పేరుతో కొన్ని లెక్క‌లు చెప్పేవారు.

''సంతృప్త స్థాయి.. అసంతృప్త స్థాయి'' అని రెండు ప‌దాలు ఎక్కువ‌గా చంద్ర‌బాబు నోటి వెంట వినిపించాయి. ప‌థ కం అమ‌లు చేసినా.. ప్రాజెక్టు క‌ట్టినా.. చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నా.. వెంట‌నే దానిని ఆన్‌లైన్‌లో పెట్టి స‌ర్వే చేసి.. `సంతృప్త స్థాయి ఇంత‌-అంత‌!` అంటూ లెక్క‌లు వేసేవారు. అన్న క్యాంటీన్లు పెట్టిన‌ప్పుడు కూడా 2019 ఎన్ని క‌ల‌కు ముందు ప‌సుపు కుంకుమ పేరుతో రూ. ప‌ది వేలు పందేరం చేసిన‌ప్పుడు కూడా సంతృప్త స్థాయిల‌ను లెక్క లు వేసుకున్నారు.

అంతేకాదు.. ఎన్నిక‌ల ప్ర‌చారం త‌ర్వాత‌.. 2019లో నిర్వ‌హించిన ప్రెస్ మీట్లోనూ ``మా పాల‌న‌పై ప్ర‌జ‌లు 89 శాతం మంది సంతృప్తిగా ఉన్నారు. అనేక మార్గాల్లో మేం స‌ర్వేలు చేశాం. నేనే స్వ‌యంగా మాట్లాడాను. మ‌ళ్లీ మేం వ‌స్తు న్నాం`` అనిచంద్ర‌బాబు ధీమాగా చెప్పారు. క‌ట్ చేస్తే.. ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలుసు. సంతృప్తి- అసంతృప్తి అనేది క్ష‌ణికావేశాలు. ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌డం క‌ష్టం. అంతా బాగుంద‌ని లెక్క‌లు వేసుకున్న జ‌గ‌న్ కూడా ఢింకీలు కొట్టారు. కాబ‌ట్టి ఈ అంచ‌నాలు ఎంత వ‌ర‌కు క‌రెక్టో ప్ర‌భుత్వం ఆలోచించుకోవాలి.

స‌రే.. ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు చ‌ర్చ‌కు వ‌స్తోందంటే.. తాజాగా మంత్రి నిమ్మ‌ల రామానాయుడు.. వ‌ర‌ద బాధితుల `సంతృప్తి`పై మాట్లాడారు. విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోని వారికి ఎంతో చేశామ‌న్నారు. ఈ నేప‌థ్యంలో ``వారంతా ప్ర‌భుత్వంపై 96% సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు`` అని నిమ్మ‌ల చెప్పారు. మ‌రి ఆయ‌న ఎక్క‌డ స‌ర్వే చేశారో.. ఎలా చేశారో.. ఆయ‌న‌కే తెలియాలి.

+ ఇప్ప‌టికీ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో మురికి నీరు అడుగు వ‌ర‌కు ఉంది. ఇది పోయే మార్గం లేక‌.. అధికారులే త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

+ ప్ర‌జ‌లు నిద్ర‌ప‌ట్ట‌క‌.. ఇబ్బందులు ప‌డుతున్నారు. జ్వ‌రాల‌తో ఆసుప‌త్రులు కిట‌కిట‌లాడుతున్నాయి.

+ ఇంకా నిత్యావ‌స‌రాలు అంద‌ని బాధితులు 30 వేల మంది ఉన్నార‌ని ప్ర‌భుత్వ‌మే చెబుతోంది.

+ ఇక‌, 1వ తేదీ నుంచి 10వ తేదీ వ‌ర‌కు పోటెత్తిన వ‌ర‌ద‌ల కార‌ణంగా.. సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్లు అందుకోనివారు.. నానా తిప్పులు ప‌డుతున్నారు.

+ ఈ పించ‌న్ల‌ను అందించే స్లాట్ ను ప్ర‌భుత్వం మూసేసింది. దీంతో వారు క‌న్నీరు పెడుతున్న ప‌రిస్థితి ఉంది.

+ నిండా మునిగిన నీటితో ఆటోలు, వాహ‌నాలు పాడైపోయి.. సాధార‌ణ జీవులు ఆప‌శోపాలు ప‌డుతున్నారు.

+ మ‌రి ఇన్ని స‌మ‌స్యలు క్షేత్ర‌స్థాయిలో పైపైనే క‌నిపిస్తుంటే(లోతుగా చూస్తే.. వంద‌లాది స‌మ‌స్య‌లు) నిమ్మ‌ల‌కు 96 శాతం సంతృప్తిగా ఉన్నార‌ని ఎవ‌రు చెప్పారో.. అర్ధంకావ‌డం లేదు. కొంత‌మంది ఫేక్ గాళ్ల స‌ర్వేలు.. మాట‌లు వినే.. గ‌తంలో చంద్ర‌బాబు.. త‌ర్వాత‌.. జ‌గ‌న్‌.. న‌ష్ట‌పోయారు. ఇప్ప‌టికైనా.. క్షేత్ర‌స్థాయికి వెళ్తే.. ప‌రిస్థితి ఎంత సంతృప్తిగా ఉందో తెలుస్తుంది నిమ్మ‌ల సార్‌!!

+ క‌నీసం సామాజిక భ‌ద్ర‌తా పించ‌న్లు అందని వారికి అందేలా ఏర్పాట్లు చేయాల‌ని ఇక్క‌డివ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోని ల‌బ్ధిదారులు మొత్తుకుంటున్నారు. క‌నీసం ఆవిష‌యంపై దృష్టి పెట్టండి నిమ్మ‌ల గారూ!!

Tags:    

Similar News