Begin typing your search above and press return to search.

అత్యంత ఘోరం... 9 ఏళ్ల బాలికలను పెళ్లి చేసుకునేలా చట్టం?

అయితే తాజాగా అమ్మాయిల వివాహ వయసు 9 ఏళ్లకు కుదించే వ్యవహారం తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   10 Nov 2024 4:30 PM GMT
అత్యంత ఘోరం... 9 ఏళ్ల బాలికలను  పెళ్లి చేసుకునేలా చట్టం?
X

అమ్మాయిలకు కనీస వివాహ వయసు 18 ఉండాలని అంటారు. ఈ నిబంధన వల్ల అప్పటికీ కనీస విద్యార్థతలు సంపాదించే అవకాశం ఉండటంతోపాటు.. వివాహ అనంతరం గర్భం దాల్చడానికి కూడా ఆమెకు మానసిక, శారీరక ఆరోగ్యం సహకరిస్తాయని చెబుతారు! అయితే తాజాగా అమ్మాయిల వివాహ వయసు 9 ఏళ్లకు కుదించే వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును... సభ్య సమాజం తలదించుకునేలా.. ప్రపంచ సమాజం గట్టిగా నిలదీసేలా.. కాస్త ఇంగితం ఉన్న వారు ఏమాత్రం అంగీకరించని ఓ చట్టం ఇరాక్ లో రూపుదాల్చనుందని తెలుస్తోంది! ఇందులో భాగంగా... దేశంలోని బాలికల పెళ్లి వయసు 9 ఏళ్లకు కుదించేలా పర్సనల్ లా చట్టాన్ని సవరించేందుకు సిద్ధమవుతోంది అక్కడి ప్రభుత్వం!

ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలో ఈ మేరకు ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టింది. దీని ప్రకారం అమ్మాయిల వివాహ వయసును 9 సంవత్సరాలకు కుదించాలని ప్రతిపాదించారు. పర్సనల్ స్టేటస్ లా ను సవరించే ఉద్దేశ్యంతోనే దీన్ని తీసుకొచ్చినట్లు చెబుతున్నారు.

ఈ సవరణకు ఆమోదం లభిస్తే... ఆ దేశంలో అమ్మాయిలు 9 ఏళ్లకు, అబ్బాయిలు 15 ఏళ్లకు పెళ్లి చేసుకోవచ్చు. ఇదే సమయంలో విడాకులు, వారసత్వ ఆస్తి, పిల్లల కస్టడీలపై మహిళలు తమ హక్కులను కోల్పోతారు! మరోపక్క ఇది చైల్డ్ సెక్స్ ను చట్టబద్ధం చేయడమేనని హక్కుల సంఘాలు భగ్గుమంటున్నాయి.

కాగా... ఇరాక్ లో ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఆ దేశంలో అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది! అయితే తాజాగా ప్రవేశపెట్టిన బిల్లు పాసైతే... ఇకపై అమ్మాయిల కనీస వివాహ వయసు 9 ఏళ్లుగా మారిపోతుంది. దీంతో... మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఈ నిర్ణయం బాలికల విద్య, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోపక్క... యూనిసెఫ్ గణాంకాల ప్రకారం ఇరాక్ లో ఇప్పటికే సుమారు 28% మంది బాలికలకు 18ఏళ్ల లోపే పెళ్లిల్లు అవుతున్నాయి! ఇక పర్సనల్ లా చట్ట సవరణ జరిగితే పరిస్థితులు మరింత ఘోరంగా మారనున్నాయని అంటున్నారు!