అల్లు అర్జున్ కు బెయిల్... హైకోర్టులో జగన్ లాయర్ వాదనలు సాగాయిలా..!

అయితే అది ఇంకా బెంచ్ పైకి రాలేదు. ఈలోపే అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెరపైకి రావడంతో.. వాట్ నెక్స్ట్ అనే చర్చ తెరపైకి వచ్చింది.

Update: 2024-12-13 18:41 GMT

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో.. అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు అనే వార్త ఒక్కసారిగా వైరల్ గా మారింది. తర్వాత కాసేపట్లోనే.. అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో... ఈ విషయం ఈ మొత్తం ఏపిసోడ్ లో అత్యంత హాట్ టాపిక్ గా, బిగ్ ట్విస్ట్ గా మారింది. వాస్తవానికి అల్లు అర్జున్ తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అది ఇంకా బెంచ్ పైకి రాలేదు. ఈలోపే అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెరపైకి రావడంతో.. వాట్ నెక్స్ట్ అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ సమయంలో క్వాష్ పిటిషన్ పై విచారణ అత్యవసరం కాదని.. సోమవారం వినాలని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టును కోరారు. అర్జున్ అరెస్టైనందుకు బెయిల్ కోసం అవసరమైతే మరో పిటిషన్ వేసుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తరుపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కీలక వాదనలు వినిపించారని అంటున్నారు.

ఇందులో భాగంగా... అల్లు అర్జున్ తన ప్రతి సినిమా విడుదల రోజున థియేటర్ కు వెళ్తారని.. ఈ మేరకు థియేటర్ యాజమాన్యం, నిర్మాత పోలీసులకు సమాచారం ఇచ్చారని.. అల్లు అర్జున్ రాత్రి 9:40కి సంధ్య థియేటర్ కి వెళ్లి మొదటి అంతస్తులో కూర్చున్నారని.. తొక్కిసలాటలో మరణించిన మహిళ కింద అంతస్తులో ఉన్నారని నిరంజన్ రెడ్డి కోర్టుకి తెలిపారని తెలుస్తుంది.

ఇదే సమయంలో... పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ తగిన భద్రత ఇవ్వలేదని నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారని అంటున్నారు. పోలీసులు కూడా భద్రత కంటే అల్లు అర్జున్ ని చూసేందుకే ఎక్కువ ఉత్సాహం చూపించారని తెలిపారని తెలుస్తుంది. ఎఫ్.ఐ.ఆర్.ను పూర్తిగా కొట్టివేయాలని పిటిషన్ వేశామని.. దానిపై విచారణ కొనసాగుతుండగానే అరెస్ట్ చేశారని నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారని అంటున్నారు.

అందువల్ల ఈ పిటిషన్ ద్వారానే మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని.. ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని న్యాయస్థానం దృషిటికి తీసుకొచ్చారని.. ఇదే సమయంలో.. అర్ణబ్ గోస్వామి - మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించడంతో పాటు.. షారుఖ్ ఖాన్ - వడోదర కేసును ప్రస్థావించారని అంటున్నారు.

దీంతో... హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు సుపరింటెండెంట్ కు రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఉత్తర్వ్యుల్లో పేర్కొంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో సమర్ధవంతంగా వాదనలు వినిపించి.. క్వాష్ పిటిషన్ లో మధ్యంతర బెయిల్ తెప్పించడంతో... నిరంజన్ రెడ్డి పేరు మరోసారి చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.

కాగా... మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఆస్తుల కేసును నిరజన్ రెడ్డే వాధించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమాకు ఈయన నిర్మాత కూడా. ప్రస్తుతం ఈయన వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. నేడు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ రావడంతో మరోసారి తెరపైకి వచ్చారు!

Tags:    

Similar News