మోడీకి నిర్మలమ్మ మరో తలనొప్పి.. ఏం జరిగింది?
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.
By: Tupaki Desk | 15 Sep 2024 4:30 PM GMTకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఈ సెగ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి చుట్టుకుంటోంది. మోడీని వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమవుతున్నాయి. ఈ విషయంపై తాడో పేడో తేల్చుకునేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. దీంతో తమినాడులో రెండు రోజలు కిందట జరిగిన ఓ ఘటన ఇప్పుడు జాతీయస్థాయిలో కుదిపేస్తోంది. ఈ పరిణామాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం మౌనంగా ఉన్నారు. కానీ, ఆమె మౌనం మరింత అనర్థంగా మారుతోంది.
అసలేం జరిగింది?
తమిళనాడులో రెండు రోజుల కిందట నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఈ సందర్భంగా జీఎస్టీ పన్ను విధానంపై నిర్మలమ్మ అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు పారిశ్రామిక వేత్తలు, ప్రముఖ హోటళ్ల యజమానులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడులోనే కాకుండా.. పలు రాష్ట్రాల్లో బ్రాంచ్‌లు ఉన్న అన్నపూర్ణ హోటల్స్ యజమాని శ్రీనివాసన్ హాజరయ్యారు. ఆయన జీఎస్టీపై మాట్లాడుతూ.. ``ఇదేం పన్ను విధానం?`` అని ప్రశ్నలు ప్రారంభించారు.
``కొన్ని రకాల తినుబండారాలపై విధిస్తున్న జీఎస్టీపై అసలు అర్థం కావడం లేదు. స్వీట్స్‌పై 5 శాతం జీఎస్టీ విధి స్తున్నారు. హాట్ ఐటంలపై 12 శాతం జీఎస్టీ వేస్తున్నారు. ఇది సరికాదు. పిల్లలు తినే బన్నుపై జీఎస్టీ లేకపో యినా క్రీమ్ బన్నుకు 18శాతం జీఎస్టీ ఉంది. ఇలా రకరకాల జీఎస్టీలతో కంప్యూటర్లు కూడా తికమకపడుతున్నాయి`` అని శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. దీనికి అప్పుడు సీతారామన్ సైలెంట్‌గానే ఉన్నారు.
అయితే.. అదేరోజు సాయంత్రానికి సీన్ మారిపోయింది. సీతారామన్ బస చేసిన హోటల్‌లో సాయంత్రం మరో సీన్ చోటు చేసుకుంది. ఇదే శ్రీనివాసన్.. పక్కన బీజేపీ నాయకురాలు కూర్చుని ఉండగా.. ఎదురుగా.. సీతారామన్ ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసన్.. నిర్మలమ్మకు `క్షమాపణలు` చెప్పారు. ``ఏదో తెలియక అన్నాను. మనసులో పెట్టుకోవద్దు`` అని తమిళంలో చెప్పారు. ఈ విడియో బయటకు రావడంతో రాజకీయంగా దుమారం రేగింది.
జీఎస్టీని ప్రశ్నించిన హోటల్ యజమానిని బెదిరించి క్షమాపణలు చెప్పించుకున్నారంటూ.. తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు క్షణాల్లోనే వైరల్ అయ్యారు. దీంతో మోడీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రా లైన కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ సహా మరిన్ని రాష్ట్రాలు.. మోడీని కేంద్రంగా చేసుకుని విమర్శ లు గుప్పిస్తున్నాయి. ఇది ఇప్పుడు జాతీయ స్థాయిలో వివాదంగా మారిపోయింది. దీనికి సమాధానం చెప్పాలంటూ.. మోడీపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఇప్పటికే పలు వివాదాలు కేంద్రాన్నిచుట్టుముట్టిన విషయం తెలిసిందే. మరోవైపు.. పలు రాష్ట్రాల్లో ఈ నెలలో ఎన్నికలు జరుగుతున్నాయి.