'మోడీ దేశానికి, అంబానీ ఇంటికి'... నీతా ఆసక్తికర సమాధానం!
అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక వార్షిక భారత సదస్సులో నీతా అంబానీ కీలకోపన్యాసం చేశారు.
అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక వార్షిక భారత సదస్సులో నీతా అంబానీ కీలకోపన్యాసం చేశారు. ఇందులో భాగంగా... భారత వాణిజ్యం, విధానాలు, సంస్కృతి, సంప్రదాయాలు వంటి అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జరిగిన ర్యాపిడ్ ఫైర్ లో అటు మోడీ, ఇటు ముకేష్ అంబానీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అవును... వీకెండ్ లో హార్వర్డ్ ఇండియన్ కాన్ఫరెన్స్ 2025లో పాల్గొన్నారు నీతా అంబానీ. ఈ సందర్భంగా... ఆధునిక ప్రపంచంలో భారత కళలు, సంస్కృతిలోని వివిధ కోణాలు, అవి పోషించే గణనీయమైన పాత్రపై చర్చించారు. ఈ సందర్భంగా ర్యాపిడ్ ఫైర్ లో అడిగిన ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ.
ఇందులో భాగంగా... ప్రధాని నరేంద్ర మోడీ, ముకేష్ అంబానీ.. వీరిలో మీకు ఎవరు గొప్ప? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పందించిన నీతా అంబానీ... "ప్రధాని మోడీతో దేశానికి చాలా మంచి జరుగుతోంది.. నా భర్త ముకేష్ అంబానీతో మా ఇంటికి మంచి జరుగుతోంది" అని జవాబిచ్చారు.
ఆమె ఇచ్చిన సమాధానంతో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నవారంతా చిరునవ్వులు చిందించారు.. తెలివైన సమాధానం ఇచ్చారు అంటూ చప్పట్లతో అభినందించారు.
ఇక ఈ సందర్భంగా నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. దాతృత్వం, సోషల్ సర్వీస్ కార్యక్రమాలతో గ్లోబల్ ఛేంజ్ మేకర్ గా నీతా అంబానీ నిలుస్తున్నరని మసాచుసెట్స్ స్టేట్ గవర్నమెంట్ వెల్లడించింది. ఇందుకుగానూ బోస్టన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ప్రశంసాపత్రాన్ని నీతా అంబానీకి ఆ రాష్ట్ర గవర్నర్ మౌరా హీలీ అందజేశారు.