నిత్యానంద మృతిపై ఊహాగానాలు: 4 వేల కోట్ల ఆస్తి ఎవరికి దక్కుతుంది?
ఒకవేళ నిత్యానంద నిజంగానే మరణించి ఉంటే, అతని 4 వేల కోట్ల రూపాయల ఆస్తి ఎవరికి దక్కుతుందనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది.;

వివాదాస్పద స్వామి నిత్యానంద మరణించాడనే వార్తలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. తమిళ మీడియా కథనాల ప్రకారం, నిత్యానంద రెండు రోజుల క్రితం మరణించాడని తెలుస్తోంది. హిందూ ధర్మాన్ని కాపాడటానికి నిత్యానంద తన ప్రాణాలను త్యాగం చేశాడని అతని మేనల్లుడు సుందరేశ్వరన్ ఒక వీడియో ద్వారా తెలియజేసినట్లు చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉంది.
ఒకప్పుడు సినీ నటి రంజితతో రాసలీలల వీడియో బయటకు రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిత్యానంద, ఆ తర్వాత పలు ఆరోపణలతో వివాదాలపాలయ్యాడు. అహ్మదాబాద్‌తో పాటు దేశంలోని 41 ప్రాంతాల్లో ఆశ్రమాలు కలిగిన నిత్యానంద, సె*క్స్ స్కాండల్ కేసులో చిక్కుకున్న తర్వాత దేశం విడిచి పారిపోయాడు. అనంతరం, 'కైలాస' అనే ప్రత్యేక హిందూ దేశాన్ని స్థాపించానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ ప్రాంతంలో 'కైలాస' పేరుతో తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
నిత్యానంద మరణించినట్లు గతంలో కూడా అనేక పుకార్లు వచ్చాయి, కానీ అవన్నీ అవాస్తవమని తేలింది. నిత్యానంద తన యూట్యూబ్ ఛానల్‌లో చివరిసారిగా శివరాత్రి రోజు కనిపించినట్లు తెలుస్తోంది.
కొందరు మాత్రం నిత్యానంద చనిపోయినట్లు నాటకం ఆడి పోలీసు కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని వాదిస్తున్నారు. ఒకవేళ నిత్యానంద నిజంగానే మరణించి ఉంటే, అతని 4 వేల కోట్ల రూపాయల ఆస్తి ఎవరికి దక్కుతుందనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. ఈ ఆస్తిని సొంతం చేసుకునే వారి జాబితాలో నటి రంజిత ముందు వరుసలో ఉండగా, మరో నలుగురు కూడా పోటీ పడే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నిత్యానంద మరణ వార్త నిజమా కాదా అనేది తేలాల్సి ఉండగా, అతని ఆస్తి ఎవరికి చెందుతుందనే చర్చ మాత్రం ఊపందుకుంది. ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.