3 రోజులుంటే రోగం.. పదేళ్ల జీవితం ఖతం.. ఢిల్లీపై గడ్కరీ నిష్టూరం
నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. అలాంటి నిజాలను కచ్చితంగా మాట్లాడేవారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.;

నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. అలాంటి నిజాలను కచ్చితంగా మాట్లాడేవారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సహజంగా మోదీ కేబినెట్ లో ఏ మంత్రి కూడా నోరు విప్పలేరు. కానీ, ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్పేసే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.
పలు అంశాలపై ఎంతో నిక్కచ్చిగా అభిప్రాయాలు వ్యక్తం చేసే గడ్కరీ తాజాగా దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంపై నోరు విప్పారు. అన్ని కాలాల్లో విపరీతమైన వాతావరణం ఉండే ఢిల్లీ గురించి ఒక కేంద్రమంత్రి అది కూడా ప్రభుత్వంలో ముఖ్యుడయిన నాయకుడు ఇలా మాట్లాడడం ఆశ్చర్యపరిచేదే. ఇంతకూ గడ్కరీ ఏమన్నారంటే..?
ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం ఉంటుందనే సంగతి తెలిసిందే. శనివారం ఐపీఎల్ మ్యాచ్ కోసం ఢిల్లీ వెళ్లిన ముంబై ఇండియన్స్ జట్టు ప్రాక్టీస్ సందర్భంగా దుమ్ముధూళిలో చిక్కుకుంది. అందుకనేనేమో కాలుష్యంపై గడ్కరీ ఆందోళన వ్యక్తంచేశారు.
దేశ రాజధానిలో మూడు రోజలు ఉంటే వ్యాధి బారిన పడడం ఖాయం అని గడ్కరీ చెప్పారు. ఢిల్లీనే కాక తన సొంత రాష్ట్రం మహారాష్ట్రకు రాజధాని అయిన ముంబై కూడా కాలుష్యం పరంగా రెడ్ జోన్ లో ఉన్నాయని పేర్కొన్నారు.
అయితే, ఢిల్లీలో పరిస్థితులు ఇలానే ఉంటే ప్రజల ఆయుష్షు 10 ఏళ్లకు తగ్గుతుందని గడ్కరీ తెలిపారు. దీనికి ఉదాహరణగా వైద్య పరిశోధనను ఆయన ఉటంకించారు. అయితే, ఉపరితల రవాణా శాఖ మంత్రి అయిన గడ్కరీ..
ఇప్పటికైనా ప్రజలు మేల్కొని ఇంధన వాడకాన్ని తగ్గించాల్సిన పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కూడా ముఖ్యమైన విషయాల్లో ఒకటిగా పరిగణించాలని కోరారు. కాలుష్యానికి ప్రధాన కారణాలు పెట్రోల్, డీజిల్ అని అన్నారు. అందుకని వాహనాల్లో ఉపయోగించే ఇంధనంలో మార్పు అవసరం అని చెప్పారు. ప్రత్యామ్నాయంగా ఇంధనాలు వినియోగించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ.. ఇటీవల ‘ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024’ను విడుదల చేసింది. అత్యధికంగా కాలుష్యం వెలువడే 20 నగరాల్లో 13 భారత్ వే. బైర్నీహాట్ (అసోం) టాప్ లో ఉండగా తర్వాత స్థానం ఢిల్లీదే. అత్యంత కాలుష్య రాజధానిగా కూడా ఢిల్లీనే అని.. ప్రజల ఆయుష్షు 5.2 సంవత్సరాలు తగ్గిందని ఐక్యూ చెప్పింది.