మోడీ పీఎం సీటుకు ఆయన గురి పెట్టారా ?

బీజేపీలో తిరుగులేని రాజకీయ ఆధిపత్యం చలాయిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ మూడు సార్లు ఆ సీట్లో కూర్చున్నారు.

Update: 2024-09-15 15:39 GMT

బీజేపీలో తిరుగులేని రాజకీయ ఆధిపత్యం చలాయిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ మూడు సార్లు ఆ సీట్లో కూర్చున్నారు. కానీ ఆయన టార్గెట్ 2029 కూడా ఉంది. ఆయన ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ 2029లోనూ బీజేపీ గెలుస్తుందని తానే ప్రధాని హోదాలో మరోసారి ఆ సదస్సుకు వస్తానని గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పారు. దాని అర్థం ఇంకో సారి కూడా ప్రధాని కావాలన్నదే మోడీ ఆలోచన అని అంటున్నారు.

అయితే బీజేపీలో మోడీకి ఈ రోజుకు గట్టిగానే పట్టు ఉంది. బీజేపీకి 240 సీట్లు ఈసారి వచ్చాయి. అవి కాస్తా ఏ 200 దగ్గరో ఆగిపోయి ఉంటే మోడీ ప్లేస్ లోకి చాలా మంది రేసులోకి వచ్చేవారు అని ప్రచారం జోరుగా సాగింది. అయితే అటువంటి బాధ లేకుండా మూడోసారి మోడీ ప్రధాని అయిపోయారు.

అయితే ఆయన అయిదేళ్ల పాటు ఈ సీటులో ఉండగలరా అని అని కూడా సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా కూటమి అయితే అయిదేళ్ల పాటు ఎన్డీయే కూటమి నడపలేదని గట్టి నమ్మకం పెట్టుకుంది. ఒక వైపు టీడీపీ మరో వైపు జేడీయూ మద్దతుతో ఎన్డీయే నడుస్తోంది కాబట్టి నమ్మడానికి లేదు అన్నదే ఇండియా కూటమి ధైర్యం.

ఇక మోడీ ఇమేజ్ మీదనే ఏది అయినా ఆధారపడి ఉంటుంది. అది పలచబడినట్లుగా ఏమాత్రం సంకేతాలు వచ్చినా ముందు కూటమిలో దాని కంటే ముందు బీజేపీలో కూడా ప్రకంపనలు మొదలవుతాయని అంటున్నారు. నిజానికి ప్రధాని మోడీకి ఆల్టరేషన్ ఎవరూ అంటే బీజేపీలో చాలా పేర్లు వినిపిస్తాయి. అందులో మొదటి స్థానం మాత్రం నితిన్ గడ్కరీ. ఆయన జాతీయ నాయకుడుగా మూడు దశాబ్దాలుగా ఉన్నారు.

అంతే కాదు ఇప్పటికి దశాబ్దన్నర క్రితమే బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయనకు ఆరెస్సెస్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఆయననే ముందుకు తేవడానికి సంఘ్ పరివార్ చూస్తుందని అంటారు. ఇక అమిత్ షా రాజ్ నాథ్ సింగ్, యోగీ ఆదిత్య నాధ్ పేర్లు కూడా ఉన్నా నితీష్ గడ్కరీకే అవకాశాలు ఎక్కువ.

ఆయన బీజేపీలో ఉదారవాదిగా గుర్తింపు పొందారు. ఆయనలో ప్రత్యేకత ఏంటి అంటే విపక్షాలకు ఇష్టుడు. ఆ విధంగా ఇమేజ్ వాజ్ పేయికే ఉండేది. ఆయన తరువాత విపక్షాలు సైతం బీజేపీలో ఇష్టపడేది నితిన్ గడ్కరీని అని అంటున్నారు. ఆయనకు అలా ఇంటా బయటా చాలానే మద్దతు ఉంది.

అయితే ఆయన మంచి పాలనా దక్షుడు. కానీ ప్రజాకర్షణ విషయంలో మాత్రం కొంత తక్కువ మార్కులు పడతాయి. అయితే బీజేపీలో వ్యక్తుల కంటే సంస్థ చాలా ముఖ్యం. ఎవరు అయినా బీజేపీ కంటే అధిగమించి ముందుకు సాగకూడదు. కానీ ఈ రోజున చూస్తే మోడీ ఇమేజ్ బీజేపీని మించి పోయింది. ముందు మోడీ పేరు ఆ తరువాత బీజేపీ పేరు వస్తుంది.

ఇది ఆరెస్సెస్ కి ఇబ్బందికరంగా ఉంది. అయితే రాజకీయంగా విజయాలు మోడీ టీం తెస్తోంది కాబట్టి ఎవరూ ఏమీ అనడానికి వీలు లేకుండా ఉంది. కానీ ఇపుడు దేశంలో జరుగుతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ చూసిన మీదట రిజల్ట్స్ ని చూసిన మీదటన చాలా ఆలోచనలు మారుతాయని అంటున్నారు. అంతే కాదు వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ కూడా ఉంది.

మరి వీటిలో కనీసంగా రెండు అయినా బీజేపీ తన ఖాతాలో వేసుకుంటే ఏ మాత్రం ఇబ్బంది లేదు. కానీ టోటల్ గా ఇండియా కూటమికి సమర్పించుకుంటే మాత్రం అపుడు అసలైన సమస్య వస్తుంది. దాంతో మోడీ ప్రభావం తగ్గిపోతుందని గ్రహిస్తే కాషాయం పార్టీలోనూ అలజడి రేగుతుంది.

ఆ టైంలో నితిన్ గడ్కరీకి చాన్స్ ఉంటుందా అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. పైగా బీజేపీ మిత్రుడిగా ఉన్న టీడీపీతో అలాగే జేడీయూతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతో ఆయన ముందు వరసలోకి వస్తారా అన్నదే చర్చ.

నాకు ప్రధాని పదవి విపక్షం ఆఫర్ ఇచ్చిందని తాను మాత్రం నైతిక విలువలకు కట్టుబడి నో చెప్పాను అని లేటెస్ట్ గా నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ బాంబుగానే చూడాలని అంటున్నారు. నాకు ప్రధాని సీటు మీద ఆశలు లేవని ఆయన అనొచ్చు కానీ రాజకీయాల్లో లేవు అంటే ఉన్నాయి అని అర్ధం అంటున్నారు. అంతే కాదు నితిన్ గడ్కరీ అలా తన ఆలోచనలు ఇండైరెక్ట్ గా బయట పెట్టారా అన్నది కూడా చూడాలని అంటున్నారు. నితిన్ గడ్కరీ పేరు ఇపుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. మొత్తం మీద చూస్తే మోడీ సీటు కి ఆయన గురి పెట్టారా అంటే ఎవరి ఆలోచనలు వారు చేసుకోవాల్సిందే.

Tags:    

Similar News