కుల రాజకీయాలు చేస్తే కొడతా.. కేంద్ర మంత్రి గడ్కరీ షాకింగ్ స్టేట్మెంట్

నాగపూర్ లో ఓ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ, సభలో కుల రాజకీయాలు ప్రస్తావించిన వారిని వారించడమే కాకుండా కొడతానంటూ హెచ్చరించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.;

Update: 2025-03-16 19:18 GMT

బీజేపీలో పెద్ద నేత, ఆర్ఎస్ఎస్ కు అత్యంత సన్నిహితుడు కేంద్ర మంత్రి గడ్కరీ సీరియస్ అయ్యారు. కుల రాజకీయాలు చేస్తే కొడతానంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తన సొంత నియోజకవర్గం నాగపూర్ లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి గడ్కరి సభలో వేలాది మంది సమక్షంలో ఈ సీరియస్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. బీజేపీలో భావి నేతగా ప్రచారంలో ఉన్న గడ్కరీ ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, అందునా కుల రాజకీయాలకు తాను వ్యతిరేకమని చెప్పుకోవడంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది.

నాగపూర్ లో ఓ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ, సభలో కుల రాజకీయాలు ప్రస్తావించిన వారిని వారించడమే కాకుండా కొడతానంటూ హెచ్చరించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సెంట్రల్ ఇండియా గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి గడ్కరీ ప్రసంగించారు. సమానత్వం ప్రాముఖ్యతను ఆయన గుర్తు చేశారు. దేశంలో కుల రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. ఒక వ్యక్తి విలువను కులం, మతం, భాష, లింగం ఆధారంగా కాకుండా వారి లక్షణాల ద్వారా నిర్ణయించాలని గడ్కరీ అన్నారు. అందుకే మనం కులం, వర్గం, మతం, భాష లేదా లింగం ఆధారంగా ఎవరిపైనా వివక్ష చూపకూడదని ఆయన తెలిపారు.

కులం పేరెత్తితే కాలుతో తంతానని ఓ 50 వేల మంది పాల్గొన్న సభలో తాను చెప్పినట్లు గడ్కరీ గుర్తు చేశారు. తాను ఇలా మట్లాడటం ద్వారా రాజకీయంగా ఇబ్బందుల్లో పడొచ్చని తన సన్నిహితులు, స్నేహితులు చెప్పారని, కానీ, తాను దాని గురించి ఆందోళన చెందడం లేదన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ఎవరూ తమ ప్రాణాలను కోల్పోరని, తాను తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని గడ్కరీ తేల్చిచెప్పేశారు. కుల ఆధారిత గుర్తింపు రాజకీయాల్లో గణనీయమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ అది తన ఓట్లు పొగొట్టినప్పటికీ తాను అలాంటి వాటికి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.

Tags:    

Similar News