క్రికెటర్ నితీశ్ రెడ్డికి చంద్రబాబు అభినందన.. లోకేష్ సన్మానం!
టీమిండియా యువ క్రికెటర్, తాజా సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి ఇటీవల బోర్డర్ – గవాస్కర్ టూర్ లో సత్తా చాటిన సంగతి తెలిసిందే.
టీమిండియా యువ క్రికెటర్, తాజా సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి ఇటీవల బోర్డర్ – గవాస్కర్ టూర్ లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. టీమిండియా ఆస్ట్రేలియా టూర్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత్ బ్యాటర్ గా నిలిచాడు.. దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సమయంలో తాజాగా సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
అవును... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా... సచివాలయంలో తనను కలిసిన నితీశ్ రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. ఇదే సమయంలో... ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరుపున రూ.25 లక్షల చెక్కును నితీశ్ కు చంద్రబాబు అందించారు.
ఈ సందర్భంగా స్పందించిన సీఎం చంద్రబాబు... ఆస్ట్రేలియా టూర్ లో సెంచరీ చేయడంతో తెలుగువారి సత్తాను ప్రపంచానికి నితీశ్ రెడ్డి చాటారని కొనియాడారు.. అతడు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నితీశ్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డితో పాటు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేసినేని చిన్ని, పలువురు పాల్గొన్నారు.
సన్మానించిన లోకేష్!:
సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన నితీశ్ కుమార్ రెడ్డి.. అనంతరం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్పందించిన లోకేష్... అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి సత్తాను నితీశ్ రెడ్డి చాటారని అభినందించారు.
అనంతరం నితీశ్ కుమార్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించిన లోకేష్.. వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా క్రీడాపాలసీలో క్రికెట్ ను చేర్చాలని ఈ సందర్భంగా నితీశ్ కోరారు.