ఇక ఇండియా కాదు...భారత్...అంతే...!
నిజానికి చూస్తే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 (1) ప్రకారం చూసుకుంటే ఇండియా భారత రాష్ట్రాల యూనియన్ అని ఉంటుంది.
ఇండియా భారత్ ఈ రెండింటి విషయంలో గత కొద్ది నెలలుగా రాజకీయ రచ్చ సాగుతోంది. భారత దేశం బయట పేరు ఇండియాగా ఉంటోంది. దాన్ని భారత్ గా మారుస్తారు అని కూడా అంటూ వచ్చారు. దానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని అన్నారు. ఇండియా పేరుతో దేశంలోని విపక్షాలు కూటమి కట్టాయి. దాంతో కూడా ఇండియా అంటే బీజేపీకి మంటెక్కుతోందని, అందుకే భారత్ అని పూర్వపు పేరునే కొనసాగించాలని అనుకుంటోందని వార్తలు వచ్చాయి.
ఇక జీ 20 సదస్సు జరిగిన సందర్భంగా ప్రపంచ దేశాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందుకు సంబంధించిన అధికారిక ఆహ్వానపత్రంలో కూడా భారత్ అని పేరు పెట్టారు. దాంతో ఒక్కసారిగా అనుమానాలు పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అని కేంద్రం ప్రకటించింది. ఆ సమావేశాలలో దేశం పేరుని భారత్ అని మారుస్తారు, రాజ్యాంగ సవరణ చేస్తారు అని కూడా గట్టిగా వినిపించింది.
తీరా చూస్తే మహిళా బిల్లుని ఆమోదించడంతో ఆ సమావేశాలు ముగిసాయి. ఇక భారత్ పేరు మార్పు ఉండదని అంతా అనుకున్నారు. అయితే ఇపుడు సడెన్ గా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ట్రైనింగ్ (ఎన్ సీ ఈ ఆర్ టీ) దీని మీద సంచలన నిర్ణయమే తీసుకుంది. ఈ సంస్థ కొత్తగా ప్రచురించిన పాఠ్య పుస్తకాలలో ఇండియా పేరుకు బదులుగా భారత్ అన్న పేరుని మారుస్తూ విడుదల చేసింది.
ఇదే కాదు ఇక మీదట వచ్చే కొత్త పాఠ్య పుస్తకాలు అన్నింటిలోనూ ఇండియాకు బదులుగా భారత్ పేరునే ఉంటుందని కూడా ఎన్ సీ ఈ ఆర్ టీ స్పష్టం చేయడం విశేషం. ఈ మేరకు ఎన్ సీ ఈ ఆర్ టీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని కమిటీ సభ్యుడు అయిన సీ ఏ ఇసాక్ చెబుతున్నారు ఈ పేరు మార్పు అన్నది అకస్మాత్తుగా జరిగింది కాదని కొద్ది నెలలుగా కసరత్తు సాగుతోందని, ఇపుడు అది అమలులోకి వచ్చిందని ఆయన అంటున్నారు.
నిజానికి చూస్తే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 (1) ప్రకారం చూసుకుంటే ఇండియా భారత రాష్ట్రాల యూనియన్ అని ఉంటుంది. దానికి అనుగుణంగానే భారత్ అన్న పేరునే ఉంచాలని దేశం విషయంలో చాలా కాలంగా డిమాండ్ ఉంది. మరి దాని మీద కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కానీ ఎన్ సీ ఈ ఆర్ టీ మాత్రం ఇండియా కాదు భారత్ అని నిర్ధారించేసింది.
మరో వైపు చూస్తే ఎన్ సీ ఈ ఆర్ టీ గతంలో భారత దేశం అసలు చరిత్రను పాఠ్యపుస్తకాల ద్వారా జాతికి చెప్పాలని కూడా నిర్ణయించింది. వాటిని హిందూ విజయం అన్న పేరుతో పుస్తకాలలో ఉంచాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టులలో కూడా భారతీయ నాలెడ్జి సిస్టం ని ప్రవేశపెట్టాలని కూడా కమిటీ సిఫార్స్ చేయడం విశేషం. మొత్తానికి ఇండియా అంటే భారత్ అని తెలుసు. కానీ ఎన్ సీ ఈ ఆర్ టీ పుస్తకాలలో మాత్రం భారత్ తప్ప ఇండియా అన్న మాట అయితే ఇక మీదట ఉండదని చెప్పవచ్చు. దీని మీద విపక్షాలు ఏ రకంగా సౌండ్ చేస్తాయో ఏ రకమైన విమర్శలు వస్తాయో చూడాల్సి ఉంది.