చంద్రబాబుతో ములాఖత్ కు భువనేశ్వరికి నో పర్మిషన్!
టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ కు ఆయన సతీమణి భువనేశ్వరికి జైలు అధికారులు అనుమతి తిరస్కరించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ కు ఆయన సతీమణి భువనేశ్వరికి జైలు అధికారులు అనుమతి తిరస్కరించారు. ఈ వారంలో రెండుసార్లు చంద్రబాబు కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. అరెస్టు అయిన రెండో రోజు చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి పరామర్శించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 14న లోకేశ్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.. చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఈ మధ్యలో చంద్రబాబు తరఫున కేసు వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూద్రా, పోసాని వెంకటేశ్వర్లు తదితరులు కలిశారు.
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కలవడానికి మూడోసారి ములాఖత్ కావాలంటే జైలు అధికారుల అనుమతి అవసరమంటున్నారు. వారిదే ఫైనల్ నిర్ణయమంటున్నారు. నిబంధనల ప్రకారం.. వారంలో మూడుసార్లు ములాఖత్ కావచ్చని చెబుతున్నారు. అయితే చంద్రబాబు తరఫు న్యాయవాదులు కూడా ఆయనను కలవడంతో మొత్తం వారంలో మూడుసార్లు ములాఖత్ లు పూర్తయ్యాయని.. అందుకే ఇక ఈ వారానికి భువనేశ్వరికి అనుమతి తిరస్కరించారని అంటున్నారు. జైలు నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నట్టు పేర్కొంటున్నారు.
కాగా తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ తన భార్యకు ఆరోగ్యం బాలేదని మూడు రోజుల సెలవు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన స్థానంలో కోస్తాంధ్ర జైళ్లు శాఖ డీఐజీ రవికిరణ్ ను రాజమండ్రి జైలు ఇంఛార్జి సూపరింటెండెంట్ గా నియమించడం విశేషం. ఈ తాజా నియామకంపై రెండు ప్రధాన పత్రికలు సంచలన కథనాలను ప్రచురించాయి. రాజమండ్రి జైలులో చంద్రబాబు భద్రతపై ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతోందని.. ఈ నేపథ్యంలో జైలు సూపరింటెండెంట్ మార్పు ప్రాధాన్యత సంతరించుకుందని రాశాయి.
కాగా.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా భువనేశ్వరి, ఆమె కోడలు బ్రాహ్మణి, కుమారుడు నారా లోకేశ్ రాజమండ్రిలోనే ఉంటున్నారు. నిబంధనల ప్రకారం ములాఖత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా కాదనడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను అక్రమంగా అరెస్టు చేసి ప్రభుత్వం.. ములాఖత్‌పైనా అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. నిబంధనల ప్రకారం ములాఖత్ కు అవాకాశం ఉన్నా.. కాదనడం సరికాదని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై టీడీపీ కూడా మండిపడింది. వారానికి మూడుసార్లు ములాఖత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా.. తిరస్కరించడాన్ని టీడీపీ తప్పుబట్టింది. ప్రస్తుతం ములాఖత్ ను తిరస్కరించిన రవికిరణ్... ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అక్క కొడుకు అని టీడీపీ ఆరోపిస్తోంది. ఇందులో నిజనిజాలు ఏంటో తెలియాల్సి ఉంది.