తవ్వడం కాదు.. పేల్చేయడమే.. కిమ్ అనుకుంటే.. కాకుండా ఉంటుందా?

ఇక వరదల నియంత్రణలో విఫలమైతే అధికారులను ఉరి తీయడమే.. అలాంటి నాయకుడు ఇప్పుడు మరో ఘన కార్యం చెప్పి చేశాడు.

Update: 2024-10-15 07:35 GMT

ఆయనేమీ ప్రజాస్వామ్య పాలకుడు కాదు.. ఎన్నికలున్నాయని భయపడే నాయకుడూ కాదు.. మిగతా ప్రపంచం ఏమనుకుంటుందోనని వెనక్కుతగ్గే రకమూ కాదు.. అవసరమైతే అణుబాంబు వేస్తామనే నియంత.. మరి అలాంటివాడు అనుకుంటే కానిది ఏముంటుంది..? దేశ ప్రజల హెయిర్ కట్ నుంచి సరిహద్దుల్లో యుద్ధం దాకా.. దేన్నయినా ఆయనే నియంత్రిస్తారు. ఇక వరదల నియంత్రణలో విఫలమైతే అధికారులను ఉరి తీయడమే.. అలాంటి నాయకుడు ఇప్పుడు మరో ఘన కార్యం చెప్పి చేశాడు.

బుడగలాంటి సంబంధాలు

కొన్ని దశాబ్దాల కిందటి వరకు ఉమ్మడిగా ఉన్న ఉత్తర-దక్షిణ కొరియాలు ఇప్పుడు ఉప్పు-నిప్పుగా మారిపోయాయి. ఈ ఇంటి మీద వాలిన కాకి ఆ ఇంటి మీద వాలడానికి వీల్లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అయితే, ఉత్తర కొరియా దుందుడుకు నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చేతిలో ఉంటే దక్షిణ కొరియా ప్రజాస్వామ్య పంథాలో ప్రయాణం సాగిస్తోంది. కాగా, ఉత్తర కొరియా ఇటీవల తమ దాయాది పైకి చెత్త బెలూన్లు పంపింది. దీని వెనుక పెద్ద ప్రణాళికే ఉందట. వాటికి జీపీఎస్‌ పరికరాలను అమర్చింది. ఏడాదిలోనే 4.44 లక్షల డాలర్ల ఖర్చుతో 6 వేల బెలూన్లను కిమ్ రాజ్య వదిలింది. ఇవి ఏకంగా దక్షిణ కొరియా విమాన సర్వీసులను ఇబ్బంది పెట్టాయి. ఇక దక్షిణ కొరియా డ్రోన్లలో కరపత్రాలు ఉంచి ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌ యాంగ్‌ లో విడుస్తోంది.

అసలే నియంత.. ఆపై అభద్రత..

కిమ్ తిరుగులేని నియంత.. పైగా తీవ్రమైన అభద్రతలో ఉంటారు. ఏ క్షణం ఎటునుంచి ఎవరు దాడిచేస్తారోనని భయంతో బతుకుతుంటాడు. ఇలాంటి సమయంలో డ్రోన్లతో కరపత్రాలు జారవిడవడం ఆయన చిర్రెత్తించింది. దీంతో దక్షిణ కొరియాతో ఉన్న సరిహద్దులను తవ్వేసి.. డ్రోన్లు కాల్చేస్తాం అని హెచ్చరించాడు. దీనిని అమలు చేస్తాడని మాత్రం ఎవరూ ఊహించలేదు. అయితే, అతడు అన్నంత పనీ చేశాడు. దాయాదిని కలిపే రోడ్లను పేల్చి వేయించాడు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ధ్రువీకరించారు.

నిస్సైనిక ప్రదేశం..

రెండు కొరియాల మధ్య కొంత ప్రాంతం నిస్సైనికం. అంటే అటు ఇటు సైనిక సంచారం ఉండదు. కిమ్ తమవైపు సరిహద్దులను పేల్చి వేయించాడు. దక్షిణ కొరియా మాత్రం వారి వైపు రహదారులను కాపాడుతోంది. కాగా, కిమ్‌ సైనిక ఉన్నతాధికారులు, భద్రతాధికారులతో సమావేశం అయిన మరుసటి రోజే సరిహద్దులను పేల్చివేత చేపట్టారట. ఈ సందర్భంగానే దక్షిణ కొరియా డ్రోన్ల సంచారాన్ని తీవ్రమైన కవ్వింపు చర్యగా అభివర్ణించాడు. మరోవైపు ఉత్తర కొరియా శతఘ్ని దళాన్ని సరిహద్దులకు తరలించారు. ఇదంతా ఎందుకంటే.. దక్షిణకొరియా డ్రోన్‌ కనిపిస్తే కాల్చివేయాలని.

మేమూ తగ్గం..: దక్షిణ కొరియా

ఉత్తర కొరియాకు తాము ఏమాత్రం తగ్గబోమని చెబుతోంది దక్షిణ కొరియా. కిమ్ చెబుతున్నదంతా అవాస్తవం అని కొట్టిపారేస్తోంది. తమ భద్రత ప్రమాదంలో పడితే ఉత్తర కొరియాను తీవ్రగా శిక్షిస్తామని హెచ్చరించింది. కాగా, కొరియా ద్వీపకల్పం 80 ఏళ్ల కిందట రెండుగా విడిపోయింది. కానీ, 2000 సంవత్సరంలో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయి. దీంతో రోడ్లను నిర్మించారు. రెండు రైలు మార్గాలనూ ఏర్పాటు చేసుకొన్నారు. వీటికి అత్యంత భారీ భద్రత ఉంటుంది. అయితే, ఉత్తర కొరియా ఎప్పుడైతే అణ్వాయుధాల అభివృద్ధి చేపట్టిందో పరిస్థితులు క్షీణించాయి. రోడ్డు, రైలు మార్గాలు బంద్ అయ్యాయి. వాస్తవానికి సరిహద్దుల్లో రోడ్ల ధ్వంసంపై ఉత్తర కొరియా గత వారమే చెప్పింది. సరిహద్దును పూర్తిగా మూసివేస్తామని వెల్లడించింది. కొరియాల మధ్య ఉన్న రోడ్లు, రైల్వే మార్గాలను నిలిపివేస్తామని పేర్కొంటూ ఈ చర్యను ‘ప్రధాన సైనిక చర్య’గా ఉత్తర కొరియా చెప్పడం గమనార్హం.

Tags:    

Similar News