టిక్కెట్ లేదా పుష్పా... బన్నీ మామకు షాకిచ్చిన కేసీఆర్!
అందులో ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ.. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం.
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ప్రత్యర్థులకు షాకిచ్చేలా ఒకేసారి 115 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. దీంతో ఎన్నికల శంఖారావం పూరించినట్లయ్యింది. ఈ క్రమంలో ముందు నుంచి చెప్తూ వస్తున్నట్లు సిట్టింగులకే పెద్ద పీట వేశారు. ఈ సమయంలో అల్లూ అర్జున్ మామ టిక్కెట్ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది.
అవును... తాజాగా 115 స్థానాలకు బీఆరెస్స్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్... కేవలం ఏడు చోట్ల మినహా మిగిలిన అన్ని స్థానాల్లో సిట్టింగులకే మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. అయితే.. ఇందులో నాలుగు చోట్లలో మాత్రం అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగులో పెట్టారు.
దీంతో... ఈ లిస్టులో కొన్ని స్థానాల్లో ఈసారి తమకే సీటు పక్కా.. అని ముందు నుంచి ప్రచారం చేసుకుంటున్న పలువురు ఆశావహులకు మాత్రం నిరాశే ఎదురైంది. అందులో ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ.. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం.
వివరాళ్లోకి వెళ్తే... పెద్దవూర మండలం చింతపల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి.. 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆరెస్స్ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మంచి రెడ్డి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆ తర్వాత టీఆరెస్స్ లోకి ఫిరాయించడంతో చంద్రశేఖర రెడ్డికి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ లభించలేదు.
అనంతరం 2018 ఎన్నికల్లో టీఆరెస్స్ అభ్యర్థిగా పోటీ చేసిన మంచిరెడ్డి విజయం సాధించడంతో ఆ నియోజకవర్గంలో ఆయన పాతుకుపోయారు. దీంతో అల్లు అర్జున్ మామ 2023 ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అంతర్గతంగా ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం బయటకు వచ్చింది.
అయితే ఈ నియోజకవర్గంలో తన తండ్రి మరణానంతరం 2021 లో ఉప ఎన్నికల బరిలో దిగి విజయం సాధించిన యువ నాయకుడు నోముల భగత్ కి కేసీఆర్ మద్దతు లభించింది.
దీంతో... చంద్రశేఖర్ రెడ్డి తాను పోటీ చేయాలనుకున్న రెండు నియోజకవర్గాలలోనూ బీఆరెస్స్ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉండడంతో టిక్కెట్ దక్కలేదు. దీంతో... భవిష్యత్తులో కూడా ఈ రెండు నియోజకవర్గాల నుండి ఆయనకు పోటీ చేసే అవకాశం లభించకపోవచ్చు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కాగా... ఎడ్యుకేషనలిస్ట్ అయిన చంద్రశేఖర్ రెడ్డి.. నియోజకవర్గంలో తనకు పట్టు ఉందని నిరూపించుకునే ప్రయత్నం ఇప్పటికే చేశారు. ఇందులో భాగంగా.. తన అల్లుడు అయిన అల్లు అర్జున్ ను కూడా ప్రచారానికి దింపబోతున్నట్లు తెలిపారు. ఫలితంగా తనకు సినిమా గ్లామర్ కూడా ఉందని తెలియజేసే ప్రయత్నం కూడా చేశారు.
కొద్ది రోజుల కిందట నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కంచర్ల చంద్ర శేఖర రెడ్డి నిర్మించిన కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు కెసిఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నాడని, ఇస్తే.. అల్లు అర్జున్ కూడా ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగింది.
అయితే వారి అంచనాలకు తలకిందులు చేస్తూ తాజాగా బీఆరెస్స్ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో... అల్లూ అర్జున్ మామ బీఆరెస్స్ లోనే కొనసాగుతారా.. లేక, మరోవైపు చూస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో కేసీఆర్... ఆయన్ని బుజ్జగించే పనికి పూనుకుంటారా అనేది కూడా ఆసక్తిగా మారింది!